పర్మనెంట్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం
బాన్సువాడలో ప్రజల తీవ్ర ఇబ్బందులు...
మాజీ వార్డు సభ్యులు,బిఆర్ఎస్ నాయకులు షేక్ అక్బర్
బాన్సువాడ, ఆగస్టు 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పర్మనెంట్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రెండు రోజుల్లో MRO కార్యాలయం ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ వార్డు సభ్యులు బిఆర్ఎస్ నాయకులు షేక్ అక్బర్ ఆరోపించారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, బాన్సువాడ పట్టణం, బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
పర్మనెంట్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రెండు వారాలు గడిచినా ఇప్పటికీ సర్టిఫికెట్లు జారీ కావడం లేదని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనీ వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సర్టిఫికెట్ల కోసం ప్రజలు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిర్ణీత సమయంలో సర్టిఫికెట్లు జారీ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.






