8 August, 2026 | 4:22 PM

ఉడందాపూర్ అభివృద్ధికి మరో ముందడుగు

08-08-2026 03:03 PM

– సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలోని ఉడందాపూర్ రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2026 మార్చి 26న తెలంగాణ శాసనసభలో జీరో అవర్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉడందాపూర్ రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ స్పందిస్తూ. ఉడందాపూర్ రిజర్వాయర్‌ను ప్రతిపాదిత సోమశిల–ఆలంపూర్ ప్రత్యేక పర్యాటక ప్రాంతంలో భాగంగా చేర్చినట్లు అధికారికంగా వెల్లడించింది. అలాగే,ఈ ప్రత్యేక పర్యాటక ప్రాంతానికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పన ప్రస్తుతం కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రతిపాదనకు పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖల గౌరవ మంత్రి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొంది.

ఉడందాపూర్ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా పర్యాటక రంగానికి ఊతం లభించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు, స్థానిక ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు, జడ్చర్ల నియోజకవర్గానికి పర్యాటకపరంగా ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది.ఉడందాపూర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రజల ఆకాంక్షను శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రత్యేక పర్యాటక ప్రాంతంలో చోటు కల్పించేలా కృషి చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.