ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు
ఇరాన్ పిచ్చి షరతులు పెట్టింది
నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు
- ఇరాన్‌పై మేమే భారీ విజయం సాధిస్తున్నాం
- యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయి
- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలీరెజా టాంగ్సిరి మృతి
- హర్మూజ్ జలసంధి మూసివేతలో అలీరెజా కీలకపాత్ర
వాషింగ్టన్/టెహ్రాన్, మార్చి 26: ఇరాన్ నేతలు చాలా భిన్నంగా, వింతగా ఉన్నారని, ఏవేవో పిచ్చి షరతులు పెట్టారని, ఆలస్యం చేస్తే ఇరాన్‌ను విధ్వంసం చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమని ఆఫర్ చేస్తూ మమ్మల్ని ప్రాధేయపడుతు న్నారు.
కానీ నేనే తిరస్కరించాను’ అని పేర్కొన్నారు. దాదాపు నెల రోజులుగా ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన మళ్లీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ నౌకాదళ కమాండర్ అలిజా టాంగ్సిరి బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో మృతి చెందారు. హోర్ముజ్ జలసంధి మూసివేతలో కీలక పాత్ర పోషించిన ఆయన మృతితో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సైనిక బలగాలు పూర్తిగా నాశనమై, తిరిగి కోలుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతో వారు ఒప్పదం చేసుకోవాలని ‘మమ్మల్ని’ తీవ్రంగా ప్రాధేయపడుతున్నారన్నారు. అయినప్పటికీ వారు తమ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని చెబుతున్నారని, వారు తప్పు చేస్తున్నారని ట్రంప్ చెప్పారు.
మరీ ఆలస్యం కాకముందే ఇరాన్ నేతలు మేలుకుంటే మంచిదని, లేకపోతే ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తామని, అంతేకాకుండా తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇరాన్ దేశానికి అధిపతిగా ఉండే ఉద్యోగం కన్నా తక్కువగా కోరుకునే పదవి మరొకటి లేదన్నారు. ‘వారు నన్ను తదుపరి సుప్రీం లీడర్‌గా చేయాలనుకుంటు న్నారు. కానీ నేను వద్దు, ధన్యవాదాలని చెప్పేశాను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గత నెలలో జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీని కొత్త నాయకుడిగా ప్రకటించారు. అయితే, యుద్ధం మొదలైనప్పటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. దాడుల్లో ఆయన గాయపడి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ను ‘సైనిక విధ్వంసం’గా పేర్కొన్న ట్రంప్, యుద్ధంలో అమెరికా ఘనవిజయం సాధించిందని మరోసారి ప్రకటించారు. వారు తమతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఇరాన్ నేతలు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి జంకుతు న్నారని, సొంత ప్రజల చేతిలో లేదా తమ చేతిలో మరణిస్తారనే భయంతో వారున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ నేవీ చీఫ్ అలీరెజా టాంగ్సిరి మృతి
ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. బందర్ అబ్బాస్ తీరప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గారడ్స్ కారప్స్ (ఐఆర్జీసీ) నావికాదళ కమాండర్ అలీ రెజా టాంగ్సిరి మరణించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిని ఉటంకిస్తూ ఆ దేశ మీడియా వెల్లడించింది. ఇరాన్‌తో యుద్ధానికి ఐదు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.
చర్చల ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని మూడు రోజుల క్రితం ఆయన ప్రకటించారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధికి సమీపంలోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీరెజా మృతి చెందారని తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి మూసివేతలో కీలక పాత్ర పోషించిన ఆయన మృతి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం జరిగే కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిపై నియంత్రణలో టాంగ్సిరి ప్రధాన పాత్ర పోషించారు. ఈ దాడి ఇజ్రాయెల్ నిర్వహించిందా, అమెరికా చేపట్టిందా అన్నదానిపై స్పష్టత లేకపోగా, ఇరాన్ కూడా అధికారికంగా ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అలీరెజా టాంగ్సిరి ఇరాన్, ఇరాక్ యుద్ధ సమయంలోనే సైన్యంలో చేరి, క్రమంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు.
2018లో ఐఆర్‌జీసీ నౌకాదళ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ వ్యూహాత్మక చర్యలనునడిపించారు. ఇటీవల అమెరికా స్థావరాలు, ఆయిల్ ఫెసిలిటీలపై దాడుల హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక యుద్ధం ప్రారంభం నుంచి అమెరికా ఇరాన్ నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని వందకు పైగా నౌకలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.




