17 April, 2026 | 3:23 AM

నియమమే నిచ్చెన.. క్రమశిక్షణే గమ్యం

17-04-2026 12:00 AM

తెలంగాణ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ అండ్ అప్పీల్) నిబంధనలు, 1991 ని సాధారణంగా సీసీఏ నిబంధనలని మన వాడుక భాషలో పిలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో క్రమశిక్షణ, పరిపాలన సమగ్రతను కాపాడటానికి ఇవి చట్టపరమైన వెన్నెముకగా పనిచేస్తాయి.

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి న్యాయమైన చికిత్స అందుతుందని నిర్ధారిస్తూనే వారి చర్యలకు వారిని బాధ్యులను చేసే ప్రవర్తన నియమావళి మాన్యువల్‌గా దీన్ని మనం భావించవచ్చు. ఈ సీసీఏ రూల్స్‌లో తరచుగా కొంత పదజాలాన్ని అనగా ఎంక్వయిరీ ఆఫీసర్, ప్రజెంటింగ్ ఆఫీసర్, ఎంక్వయిరీ రిపోర్ట్, మేజర్ పెనాల్టీ లు, మైనర్ పెనాల్టీలు మొదలైన వాటి గురించి మనం వింటుంటాం. వాటిలో కొన్నింటి గురించి అయినా ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజలు అవగాహ న పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

విచారణ అధికారి నియామకం 

ప్రభుత్వ ఉద్యోగి క్రమశిక్షణ అధికారి ఎదుట హాజరై తనపై మోపబడిన ఆరోపణలను అంగీకరించనప్పుడు లేదా సమాధానం చెప్పడానికి నిరాకరించినప్పుడు లేదా విస్మరించినప్పు డు క్రమశిక్షణ అధికారి ఆ విషయాన్ని రికా ర్డు చేసి ప్రభుత్వ ఉద్యోగి సంతకాన్ని తీసుకోవాలి. ఆపై సదరు అధికారి విచారణను తానే స్వయంగా నిర్వహిం చవచ్చు లేదా అవసరమని భావిస్తే విచారణ జరిపేందుకు సర్వీస్‌లో ఉన్న లేదా ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని విచారణ అధికారిగా నియమించవచ్చు. ముఖ్య గమనికలు: టీఎస్ సివిల్ సర్వీసెస్ సీసీఏ నిబంధనలు 1991 ప్రకారం క్రమశిక్షణ అధికారి స్వయంగా విచారణ జరిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ, సాధారణంగా మరొక అధికారిని విచారణ అధికారిగా నియమించడం పరిపాటి.

విచారణాధికారిగా ఎంపికయ్యే వ్యక్తి తగినంత సీనియర్ హోదాలో ఉండాలి. చార్జ్‌ను ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగి పట్ల సదరు విచారణ అధికారికి ఎటువంటి ముందస్తు పక్షపాతం లేదా వివ క్ష ఉండకూడదు. గతంలో ఆ కేసు లేదా ఆరోపణల విషయంలో సదరు అధికారి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండకూడదు. ఆ ఆరోపణల తీవ్రతను అను సరించి విచారణ అధికారిగా తన శాఖలో ఉన్న సీనియర్ అధికారిని లేదా కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీ చైర్మన్ లేదా అందులోని సభ్యులను కూడా నియమించవచ్చు. అయితే వారు సర్వీస్‌లో ఉన్న లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి.

విచారణధికారి విధులు..

విచారణ అధికారి విధులు ఈ విధంగా ఉంటాయి. విచారణ తేదీ, సమయాన్ని విచారణ అధికారి ఖరారు చేయాలి. విచార ణ జరిపేందుకు ఎంచుకున్న తేదీ, సమయం తదితర విషయాలను నిందితుడికి, అలాగే ప్రాసిక్యూషన్ సాక్షులకు తగిన సమాచారం ద్వారా ముందస్తుగా తెలియజేయాలి. విచారణ అధికారి అవసరమైతే నిందితుని సౌక ర్యాన్ని పరిగణనలోకి తీసుకొని, విచారణ వేదికను కూడా ఎంచుకోవచ్చు.

అయితే విచారణ అధికారి స్వయంగా వేదికను ఎం చుకోవడం వల్ల విచారణ చెల్లకుండా పోతుందనిగాని, అది సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తుందనిగాని అర్థం కాదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై విచారణ ఎక్కడ జరగాలని దానిపై కచ్చితమైన నిబంధనలు ఏమీ లేవు. విచారణ అధికారి స్వయంగా వేదికను ఎంచుకోవడం వల్ల ఉద్యోగి తనను తాను రక్షించుకునే అవకాశాన్ని ఏ రకంగా అయినా కోల్పోయాడా లేదా అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ చూడాలి. విచారణ అధికారి రక్షణ సాక్షులను పేర్కొనమని నిందితుని అడగవచ్చు. అంతేకాదు, నిందితులు సాక్షుల గురించి తెలిపినప్పుడు విచారణ అధికారి వారికి కూడా సమన్లు జారీచేయాల్సి ఉంటుంది.

నివేదిక అధికారి..

విచారణ అధికారి ముందు క్రమశిక్షణ అధికారి  ఆరోపణలు రుజువు చేయడానికి తన తరపున వాదించేందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని లేదా న్యాయవాదిని ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించవచ్చు. సాధారణంగా ఆ శాఖకు చెందిన, ఆ కేసుకు సంబంధించిన విషయాలపై అవగాహన ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రజెంటిం గ్ ఆఫీసర్‌గా నియమిస్తారు. అయితే సంక్లిష్టమైన, చట్టపరమైన అంశాలతో ముడిపడి ఉన్న సందర్భాల్లో మాత్రం న్యాయవాదిని కూడా నియమించడం ఉత్తమమని భావించవచ్చు.

ముఖ్యమై న నియమాలు: 1. హోదా: ప్రజెంటింగ్ ఆఫీసర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగి కంటే పై హోదాలో (సీనియర్ ) ఉండాలి. 2. నిష్పాక్షికత: ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ చేసిన అధికారిని ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించకూడదు. ఎందుకంటే అతనిపై పక్షపాత వహించారనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది. 3. నిర్దేశించిన విచారణ పద్ధతు లు సరిగ్గా పాటించేలా ప్రజెంటింగ్ ఆఫీసర్ చూసుకోవాలి. 4. విచారణ అధికారి ప్రవర్తనలో ఏవైనా అక్రమాలు లేదా పక్షపాత ధోరణి కనిపిస్తే వెంటనే లిఖితపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేయాలి. అంతేకా దు, ఆ విషయాన్ని క్రమశిక్షణ అధికారికి వెంటనే నివేదించాలి. ప్రజెంటింగ్ ఆఫీసర్ కు అవసరమైన అన్ని పత్రాలు, రికార్డుల కాపీలను కచ్చితంగా అందించాలి. 

కొన్ని సందర్భాల్లో అసలు పత్రాలను కూడా అత ని వద్ద ఉంచవచ్చు. 5. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి సమర్పించిన రక్షణ పత్రాన్ని ప్రజెంటింగ్ ఆఫీసర్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ ఆ ఉద్యోగి కొన్నివాస్తవాలను అంగీకరించినట్లయితే ఆ వివరాలను జాబి తా చేసి విచారణ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. దీనివల్ల అప్పటికే అంగీకరించిన విషయాలను మళ్లీ సాక్ష్యాలతో నిరూపించాల్సిన అవసరం ఉండదు.

ఉద్యోగుల దుష్ప్రవర్తనకు శిక్ష విధించేలా నియమావళిని రూపొందించిన ప్పటికీ, అలాగే కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి అనుసరించాల్సిన విధానా లు, నిర్దిష్ట కాలపరిమితిని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు వివిధ ఆదేశాలు జారీచేసినప్పటికీ, క్రమశిక్షణ అధికారులు తరచుగా ఈ కేసులను నిర్ణిత గడువులోగా పరిష్కరించడంలో విఫలమవుతున్నారని, బదులుగా ఈ కేసుల విచారణ పూర్తి చేయడానికి చాలా ఏళ్లు పడుతుందని గమనించడమైనది.

దీని ఫలితంగా అభియోగాలు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని, మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఎందుకంటే వారి సస్పెన్షన్ క్రమబద్ధీకరించబడదు. వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేయబడతాయి. అంతేగాక పేపిగ్జేషన్లు నిలిచిపోతాయి. సంబంధి త అధికారులు నిర్ణీత కాల పరిమితులను పాటిస్తూ ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించినప్పుడు మాత్రమే ఉద్యోగికి నిజమైన న్యాయం జరుగుతుంది. అంతేకాదు, ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం రూపొం దించిన ఈ నియమ నిబంధనల ఉద్దేశం నెరవేరుతుంది.

వ్యాసకర్త: రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

మనోహర్‌రావు చిలప్పగారి