నిజమే చిగురిస్తుంది!
పూచే పువ్వుకు కల్మషం ఉన్నదా?
నాటిన విత్తనమే గాసేటి రూపం
మట్టిలో నిద్రపోయినా
మలినాం దాచదు
నిజం తడిసిన మొక్కే
పరిమళం ఇస్తుంది
గంగలో కలిసే నీటికి రంగులుంటాయా?
పర్వతం నుంచే జారిన జలమే గానీ
మార్గంలో మలి?మ్ చేరినా
తన స్వరూపం మాత్రం మరచిపోదు
నింగిలో ఎగిరే పక్షికి
మాయలుంటాయా?
పుట్టుకలో నేర్చుకున్న రెక్కలే గానీ
గాలి ఎటు తోసినా మార్గం
తారుమారైనా
గమ్యం మాత్రం మనసులోనే వుంటుంది
విత్తిన ప్రేమకు ద్వేషం పుడుతుందా?
మనసు నాటిన భావమే
మొలకెత్తుతుంది
కన్నీరు చిందించిన నేలలో కూడా
ఆశలే పువ్వులై వికసిస్తాయి
కలిసిన మనసుకు కపటం చేరుతుందా?
స్నేహం నాటిన హదయం
నిజమే పంచుతుంది
కాలం మారినా మాటలు మసకబారినా
ఆత్మీయత మాత్రం ఆరిపోదు
నడిచిన దారిలో నీడ తప్పుతుందా?
వెలుగే దారిని చూపించినా
చీకటి కమ్ముకున్నా సత్యం వెలిగితే
మనిషి అడుగులు తడబడవు
అందుకే జీవితం నేర్పేది ఒక్కటే ---
ఏం నాటితే అదే మొలుస్తుంది
మనసులో మలినం నాటితే బాధ పెరుగుతుంది
నిజం నాటితే నిత్య సుగంధమే పూస్తుంది మన జీవన గీతం
మన చేతుల్లోనే ఉంది
మనసు మట్టిగా మారితే
భావం విత్తనమవుతుంది
సత్యం నీటిగా పారితే
ఆశ మొలకెత్తుతుంది
అప్పుడు
మనిషి జీవితం
పుష్పవనమవుతుంది !!
చిటికెన కిరణ్‌కుమార్






