రాష్ట్రానికి డెల్టా ఏయిర్‌లైన్స్ పెట్టుబడులు!
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం
మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తికి డెల్టా సంస్థ స్పందన
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అట్లాంటాలోని డెల్టా ఏయిర్‌లైన్స్ కార్యాలయంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీవో నారాయణన్ కృష్ణకుమార్‌తో మంత్రి సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం సమావేశమయ్యింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ మాట్లాడుతూ.. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. అలాగే పెట్టుబడులపై మంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి వ్యక్తంచేసిన కృష్ణకుమార్, డెల్టా టీం.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు తెలిపారు.
హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం
అమెరికా పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్‌ను కోరారు. నేరుగా విమానాలు లేకపోవడం వల్ల అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని మంత్రి వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన డెల్టా ఏయిర్‌లైన్స్ యాజమాన్యం హైదరాబాద్‌కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల స్పందన పట్ల ఇరువురు మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ఈ పర్యటనలో మంత్రులతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్‌రంజన్, పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రటరి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.






