29 August, 2026 | 6:57 PM

ఊటుపల్లి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు

29-08-2026 05:25 PM

 విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్న గ్రామస్తులు

గ్రామపంచాయతీ కార్యదర్శిపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్

బోధన్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): బోధన్ మండలం ఊటుపల్లి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపసర్పంచ్ నరేందర్ గౌడ్, వార్డు సభ్యుడు రవి తెలిపారు.  గ్రామంలోని పలు ప్రాంతాల్లో మురుగు నీరు నిలిచిపోవడంతో పాటు మురుగు కాలువల పరిసరాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. 

గ్రామంలో విష జ్వరం విజృంభిస్తున్నప్పటికీ బోధన్ జిల్లా ఆస్పత్రిలో పలువురు పెడితే అడ్మిట్ అయినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. మురుగు నీటి గుంతలు, చెత్తాచెదారం కారణంగా గ్రామ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని, నిల్వ నీటితో దోమల వ్యాప్తి పెరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. మురుగు నీరు సక్రమంగా వెళ్లకపోవడం, కాలువలు శుభ్రంగా లేకపోవడం వల్ల వ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు.

వర్షాకాలం నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రం కాకముందే అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. గ్రామంలోని మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి పూడిక తొలగించడం, నిల్వ నీటిని తొలగించడం, కాలువల వెంట పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం, చెత్తను ఎప్పటికప్పుడు తరలించడం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను అధికారులు స్వయంగా పరిశీలించి, తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా మురుగు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. విష జ్వరాలతో ఇప్పటికే పలువురు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితుల్లో అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది తక్షణమే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.