18-12-2025 12:55:59 AM
స్పీకర్ తీర్పుపై మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాహుల్ గాంధీ ‘సేవ్ ది కానిస్టిట్యూషన్’ నినాదం.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో పూర్తిగా బహిర్గతమైందని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధిక్కరించడం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని తెలిపారు.
‘సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇది ఎంతో సిగ్గుచేటు అని, ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని పేర్కొన్నారు.