12-11-2025 11:08:35 PM
35 మందిని పరీక్షించగా 26 మందికి గుర్తింపు..
మేడ్చల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో 35 మందికి దంత పరీక్షలు నిర్వహించగా అందులో 26 మందికి దంత సమస్యలు ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని బట్టి బాల్యం దంత సమస్యలతో ఎంత బాధ పడుతుందో అర్థమవుతోంది. మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఏడు అడ్వాన్స్ దంత చికిత్స విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో బుధవారం నేరేడ్మెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 35 మందికి స్క్రీనింగ్ చేయగా, అందులో 26 మంది విద్యార్థులకు పాడైన దంతాల (డీకేడ్ టూత్) సమస్యలు గుర్తించారు. వీరికి దంత వైద్య నిపుణుడు డాక్టర్ వినోద్ ఫిల్లింగ్, ఎక్స్ట్రాక్షన్ వంటి చికిత్సలు నిర్వహించారు. హెచ్‌ఎంటి 1 నుంచి వచ్చిన నలుగురు బి ఆర్ ఎస్ కె విద్యార్థులకు చికిత్స చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రమం తప్పకుండా దంత పరీక్షలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.