15 March, 2026 | 9:34 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

బేగంపేట పోస్టాఫీసులో డిపాజిట్లు మాయం

27-10-2024 01:30 AM
  1. నకిలీ పాస్‌బుక్స్‌తో రూ.30 లక్షలు కాజేత
  2. సబ్ పోస్ట్‌మాస్టర్ చేతివాటంగా అనుమానం

పెద్దపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట తపాలా శాఖలో డిపాజిట్లు గల్లంతైన ఘటన వెలుగుచూసింది. పోస్టాఫీసులో సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పని చేస్తున్న హేమ చేతివాటంగా విచారణలో బయటపడగా, సెంటినరీకాలనీ పోస్టాఫీసులో పనిచేసే మరో సబ్ పోస్ట్‌మాస్టర్ నరేంద్రచారి హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై అధికారులు శనివారం పోస్టాఫీసుకు చేరుకొని విచారణ చేపడుతుండగా, ఖాతాదారులు చేరుకొని ఆందోళన చేశారు. దీనితో సబ్ డివిజన్ పోస్టల్ అధికారి మోహన్.. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. సబ్ పోస్ట్‌మాస్టర్ హేమను ప్రశ్నించారు. ఖాతాదారులు సంయమనం పాటించాలని, గల్లంతైన సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. కాగా.

ఈ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయడంలో ఎవరెవరి హస్తం ఉందోనన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ పోస్ట్‌మాస్టర్ హేమను వివరణ అడగగా, తనకేమీ తెలియదనీ, సబ్ పోస్ట్‌మాస్టర్ నరేంద్రచారి ఇదంతా చేశాడనీ, తనకు నకిలీ పాస్ పుస్తకాలు పంపిస్తే సంతకాలు చేశానని చెప్తున్నారు.

తనకు కొద్ది రోజులు గడువు ఇస్తే ఆ సొమ్మును తిరిగి ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడం గమనార్హం. మహిళా పోస్ట్‌మాస్టర్ హేమ చేతివాటం వల్లనే ఇదంతా జరిగిందని విచారణలో వెల్లడైనట్టు అధికారి మోహన్ తెలిపారు. ఇదిలా ఉండగా సెంటినరీకాలనీ, బేగంపేట పోస్టాఫీసులలో ఇంకా డిపాజిట్లు గల్లంతై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.