పర్యాటక కేంద్రంగా పులిగుండాల
కాటేజీల నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఎకో టూరిజం ప్రారంభించిన డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి
ఖమ్మం/ పెనుబల్లి, ఏప్రిల్15 (విజయక్రాంతి): పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంట గ్రామంలోని పులిగుండాల ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పులిగుండాల ప్రాజెక్ట్‌ను దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రారంభించి పరిశీలించారు.
ఈ సందర్భంగా బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్ సఫారీ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.కనకగిరి హిల్స్ అభివృద్ధిని తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్ట్ నీటి పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాటేజీల నిర్మాణానికి 4 కోట్లు సీఎస్‌ఆర్ నిధుల నుంచి మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయడమే మా అందరి లక్ష్యమని అన్నారు. కనకగిరి హిల్స్ వంటి అందమైన ప్రాంతాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ ఏకో టూరిజం ప్రారంభించు కోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో పీసీసీఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అశ్వరావుపేట/దమ్మపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ అత్యవసరమని, రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలనుసాగు చేసుకునేందుకు విద్యుత్ ఉపకేంద్రాల సామర్థ్యాన్ని పెంచడం కీలకమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియో జకవర్గం దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాలలో నిర్మించనున్న రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, డాక్టర్ మట్టా రాగమయి, ఎన్పీడీసీఎల్ సిఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. జగ్గారం, మల్లారంలో రూ. 5 కోట్ల వ్యయంతో ఉపకేంద్రాల పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.






