సింగరేణి ఉద్యోగాల గని
హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలకు దేశంలోని బొగ్గు గనులను కేటాయించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన గనుల సవరణ చట్టానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. కానీ గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనకూడదని కేసీఆర్ ఆదేశించారని భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ సన్నిహితులకు బొగ్గు గనులు వెళ్లేలా కుట్ర చేశారని ఆరోపించారు.
కేసీఆర్ సన్నిహితుల కోసం సింగరేణిని బొంద పెట్టారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లుందన్నారు. సింగరేణి గని అంటే.. ఉద్యోగాల గని అన్నారు. సింగరేణి తెలంగాణకే తలమానికం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం జరిగితే పాల్గొనకుండా.. ఒడిశాలో జరిగిన వేలంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. సింగరేణి పక్కన జరిగే వేలంలో పాల్గొనకుండా.. ఒడిశాలో జరిగిన వేలంలో పాల్గొన్నారని తెలిపారు.
గనుల చట్టానికి కేంద్రం సవరణలు తీసుకొచ్చి ఆమోదించుకుందన్నారు. బొగ్గు గనులు కావాలంటే ఎవరైనా వేలంగా పాల్గొనేలా చట్టం చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణ నాయకుడే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉన్నారన్న భట్టి విక్రమార్క సింగరేణిని కాపాడాలని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి ఆస్తులను, వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సింగరేణి బంద్ అయితే చాలా మందికి ఉద్యోగాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, రాష్ట్రంలో 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు.






