ప్రజలందరి సంపద.. ప్రజలకే సొంతం: సీఎం చంద్రబాబు
అమరావతి: ఐదు కోట్ల ప్రజానీకానికి దశ, దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ప్రాంతంలో సీఎం గురువారం పర్యటించారు. రాజధానికి పవిత్ర మట్టి, జలాలు తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. ప్రజలందిరి సంపద.. వారికే సొంతం అన్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లు ఉండే నది గోదావరని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతోందన్నారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేశారని ఆరోపించారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం.. శాపంగా మారిందన్నారు. పోలవరం పూర్తి, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అవకాశముందన్నారు. రైతులంతా 1631 రోజులు ఆందోళన చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆందోళన విరమించారని చెప్పారు. సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రాజధాని రైతులకే దక్కుతోందన్నారు. రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.






