8 August, 2026 | 1:30 AM

జలాశయం నిండినా.. ఎండుతున్న ఆయకట్టు!

08-08-2026 12:27 AM

కడెం ఎడమ కాలువకు నీటి విడుదలకు మోక్షం ఎప్పుడు...?

ముదిరిపోతున్న వరి నార్లు.. 

ఆందోళనలో రైతాంగం

జన్నారం, ఆగస్టు 7: కడెం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రాజెక్టులో పుష్కలంగా నీటి నిల్వ ఉన్నప్పటికీ ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కడెం ఆయకట్టు పరిధిలో సుమారు 29 గ్రామపంచాయతీలు ఉండగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా నీటిని విడుదల చేయకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ ప్రాంత ప్రజలు పూర్తిస్థాయిలో వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సమయానికి నీరు విడుదలవుతదన్న ఆశతో రైతులు వేలాది ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు నారు మళ్లు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎడమ కాలువ నుంచి చుక్క నీరు కూడా వదలకుపోవడంతో వేసిన వరి నారు ముదిరిపోయే స్థాయికి చేరుకుంది.

అధికారుల నిర్లక్ష్యం...

ఎండాకాలం అంతా హాయిగా విశ్రాంతి తీసుకుని తీరా సాగుకాలం మొదలయ్యాక నిద్రలేవడం ఇరిగేషన్ అధికారులకు అలవాటుగా మారింది. కాలయాపన తప్ప పనులపై పట్టింపు లేని పరిస్థితి దాపురించింది. ఎండాకాలంలో చేయాల్సిన కాల్వల, తూముల మరమ్మత్తులను గాలికి వదిలేయడంతో వానాకాలం పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల కడెం ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వ్యవసాయానికి, రైతుల జీవనాధారానికి కడెం ప్రాజెక్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంతో కీలకం. సమర్థవంతమైన నీటి నిర్వహణ, సకాలంలో కాల్వల పూడికతీత, తూముల వద్ద మరమ్మత్తులు చేపట్టడం డిపార్ట్మెంట్ పక్షాన ఎంతో అత్యవసరం. కానీ ఇవేవీ పట్టించుకోకపోవడంతో వ్యవస్థ నాశనమవుతోందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.