18-01-2026 12:21:35 PM
ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే నాలక్ష్యం
వాళ్లనుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతాను
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti vikramarka) ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆస్తుల సంపాదన కోసమో.. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో తాను రాజాకీయాల్లోకి రాలేదని వివరించారు. రాష్ట్ర ఆస్తులు, వనరులను సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే తన లక్ష్యమన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ లకు టెండర్లు పిలిచింది.. సింగరేణి సంస్థ అన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో అడ్డగోలు రాతలు రాశారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుకథ, పిట్టకథలు అల్లి ప్రజలను మభ్యపెట్టేలా కథనం రాశారని కొట్టిపారేశారు.
కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు చెప్పినట్లు వెల్లడించారు. తాను వైఎస్ కు సన్నిహితుడిని కాబట్టి.. వైఎస్ఆర్ మీద ఉన్న కోపం తన మీద చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఒక పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతానని భట్టి హామీ ఇచ్చారు. ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసే కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు.