10 June, 2026 | 1:35 AM

పేదల సొమ్మంతా గత పాలకుల ఇళ్లకే

10-06-2026 12:00 AM

బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కై ప్రజలను వంచిస్తున్నాయి

రైతుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదు

రికార్డు స్థాయి ధాన్యపు కొనుగోళ్లు, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే మాపై తప్పుడు ప్రచారాలు 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జనగామ జిల్లా పల్లగుట్టలో బహిరంగ సభ

జనగామ, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతులను, ప్రజలను వంచిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం పల్లగుట్ట గ్రామంలో మంగళవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

తమ ప్రభుత్వం చేస్తోన్న రికార్డు స్థాయి ధాన్యపు కొనుగోళ్లు, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నిప్పులు చెరిగారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేశారు.

పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను, వనరులను దోపిడీ చేశారు’ అని భట్టి ఆరోపించారు. ‘ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్లారు. ఆ పాపానికి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ.76 వేల కోట్ల రూపాయలను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు కట్టాల్సి వస్తోంది. ఆ అప్పులే లేకపోయి ఉంటే ఈ రూ.76 వేల కోట్లను ప్రజల సంక్షేమానికి అందించి రాష్ట్ర దశ, దిశ మార్చేవాళ్లం’ అని చెప్పారు. పేదల సొమ్మంతా గత పాలకుల ఇళ్లకే పోయిందని ఆరోపించారు. 

డిస్కంలను ముంచింది మీరు కాదా?

పదేళ్ల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలు గప్పాలు కొట్టుకున్నారే తప్పా డిస్కంలకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా వాటిని అప్పుల పాలు చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘మీరు చేసిన తప్పుల వల్ల డిస్కంలు ఆదాయం లేక, క్వాలిటీ పవర్ ఇవ్వలేక ఇబ్బంది పడ్డాయి. కానీ, మా ప్రభుత్వం వచ్చాక రైతులు కట్టాల్సిన రూ. 14 వేల కోట్లను, పేదల ఉచిత కరెంట్ (గృహజ్యోతి) బిల్లు రూ. 5 వేల కోట్లను.. మొత్తంగా రూ. 19 వేల కోట్లను ప్రతి నెల ఆర్థిక శాఖ ద్వారా నేరుగా డిస్కంలకు చెల్లిస్తూ క్వాలిటీ పవర్ ఇస్తున్నాం’ అని చెప్పారు.

‘సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మా క్యాబినెట్ రోజుకు 18 గంటలు ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తుంటే పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు వార్తల్లో ఉండటం కోసం రోజుకో అబద్ధపు వార్తను సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు. అధికారం పోయిందనే తట్టుకోలేక కట్టుకథలు అల్లుతున్నారు‘ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద వదిలేయాలని కేంద్రం చూస్తోందని భట్టి ఆరోపిం చారు. ‘మద్దతు ధర  ప్రకటించిన కేంద్ర ప్రభు త్వం.. మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్న ధా న్యాన్ని ఎఫ్‌సిఐ ద్వారా ఎందుకు సేకరించడం లేదు అని ప్రశ్నించారు.

కేంద్రం కొన్నా, కొనకపోయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రమను గౌరవిస్తూ చివరి ధాన్యపు గింజ వరకూ కొంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 72.30 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని.. కానీ బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు కల్లాల్లోకి వస్తాం, రైతుల కన్నీళ్లు తుడు స్తాం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ’డబుల్ బెడ్రూమ్’ పేరుతో పేదలను వంచించిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, తొలి విడతగా రూ. 22,500 కోట్ల వ్య యంతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి అద నంగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. మహిళా సం ఘాలకు రెండున్నరేళ్లలోనే రూ. 67 వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించామని, ఐదేళ్లలో ఈ మొత్తాన్ని రూ. 1.25 లక్షల కోట్లకు పెంచుతామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 

యాదాద్రి జిల్లాలో పర్యటన

యాదాద్రి భువనగిరి(విజయక్రాంతి): భువనగిరిలో విద్యుత్‌శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు భట్టి విక్రమార్క హాజరై మాట్లా డారు. గత ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం పదేళ్ల పాలనలో ఉచిత కరెంట్ పేరుతో ఓట్లు దండుకుందే తప్ప, డిస్కంలకు నిధులు ఇవ్వకుండా అప్పులపాలు చేసిందన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, తడక వెం కటేశం, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటి ల్, కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.