హత్యకేసులో డేరా బాబాకు ఊరట
నిర్దోషిగా పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, మే 28: డేరా కమిటీ సభ్యుడు రంజిత్‌సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబా అలియాస్ గుర్మిత్ బాబా రామ్ రహీమ్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్దోషిగా విడుదల చేస్తూ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. రంజి త్‌సింగ్ 2202లో దారుణ హత్యకు గురయ్యాడు. డేరా బాబా తన ఆశ్రమంలోని మహిళలపై అకృత్యాలకు పాల్పడుతుండగా అజ్ఞాత వ్యక్తిగా రంజిత్ సింగ్ బయటి ప్రపంచానికి లేఖ రాశాడని 2002లో వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆశ్రమంలో హత్యకు గురయ్యాడని నాడు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈకేసుతో పాటు సాధ్వీలపై లైంగికదాడులు, ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా డేరా బాబాను సీబీఐ కోర్టు ప్రకటించింది. రంజిత్ సింగ్ హత్య కేసులో 2021లో ఆ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశాడు. కేసులో నిర్దోషి అని హైకోర్టు తేల్చి డేరా బాబాకు ఊరటనిచ్చింది. తీర్పుపై డేరా బాబా స్పందిస్తూ తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఇప్పటికైనా తనకు న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. కాగా, లైంగికదాడులు, జర్నలిస్టు హత్యపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు.
ఆది నుంచీ వివాదాస్పదమే..
డేరా బాబా ఆది నుంచి వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగానే ముద్ర వేసుకున్నాడు. సాధ్విలపై లైంగిక దాడులు, వేధిం పులు, పలువురు సాధ్వీల హత్యలపై అనేక కేసులు ఎదుర్కొన్నాడు. 2014లో ఆయనపై పదుల సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో డేరా బాబా తనని తాను నపుంసకుడిగా ప్రకటించుకున్నాడు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు సంచ లనమయ్యాయి. కానీ ఆయన ప్రకటనను న్యాయస్థానాలు మాత్రం తోసిపుచ్చాయి. కోర్టు మూడు కేసుల్లో జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నాడు హర్యానాలో హింస చెలరేగింది. అల్లర్లలో మొత్తం 30 మంది మృతిచెందారు. 250 మంది గాయాలపాలయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది.






