28 June, 2026 | 11:10 AM

రెరా నిద్ర లేచేనా!

02-06-2024 01:57 AM

తెలంగాణలో ఆగని ప్రీలాంచ్ మోసాలు

అరికట్టడంలో పూర్తిగా విఫలమైన రెగ్యులేటరీ

మోసాలను పట్టించుకోని నిర్మాణ సంఘాలు

కోట్లాది రూపాయలు నష్టపోతున్న ప్రజలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 1 (విజయాక్రాంతి): రియల్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన టీఎస్ రెరా నిద్రపోతోంది. హైదరాబాద్ కేంద్రంగా రియల్ మోసాలు జోరుగా జరుగుతున్నాయి. దీంతో రియల్ రంగంలో రారాజుగా వెలుగుతున్న హైదరాబాద్ ప్రీలాంచ్ స్కాములకూ రాజధానిగా మారుతోంది. గతంలో ప్రీలాంచ్ మోసాలకు పాల్పడిన రియల్ సంస్థలపై రెరా కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. తాజాగా భారతీ లేక్‌వ్యూ అనే రియల్ సంస్థ రూ.60 కోట్ల ప్రీలాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ సంస్థలు కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేసి బయ్యర్ల నెత్తిపై శఠగోపం పెడుతున్నాయి. అక్రమ అమ్మకాల గురించి క్రెడాయ్ హైదరాబాద్ వంటి నిర్మాణ సంఘాలకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదనే అపవాదు ఉంది.

ఈ క్రమంలోనే ప్రీలాంచ్ స్కాములు రాష్ట్రంలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ రియల్ బ్రాండ్ ఇమేజ్‌కు తూట్లు పడుతున్నాయి. గత ప్రభుత్వం హైదరాబాద్ రియల్టీ రంగంపై హైప్ సృష్టించడంతో ఇతర రంగాల నుంచి అనేక మంది ఈ రంగంలోకి విచ్చేశారు. ముందుగా స్థలం తీసుకుని  కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేసి  ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించారు. కానీ అనుమతులు రాక, మార్కెట్ స్థితిగతులు అంచనాలు తప్పడంతో భవన నిర్మాణం ఆరంభించాల్సిన సమయం వచ్చేసరికి బోర్డు తిప్పేస్తున్నారు. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. 

పట్టించుకోని నిర్మాణ సంస్థలు..

నిర్మాణ రంగంలో కస్టమర్ల ఇన్వెస్ట్‌మెంట్లకు ష్యూరిటీ ఉంటుంది అన్నట్లుగా క్రెడాయ్ హైదరాబాద్ గొప్పలు చెబుతుంది. కానీ, ఆయా సంఘంలో కీలకంగా ఉన్న సభ్యులు చేస్తున్న ప్రీలాంచుల్ని అరికట్టడంలో మాత్రం ఆ సంఘం పూర్తిగా విఫలమైంది. దీంతో ప్రీలాంచులు చేయకపోతే బిల్డర్లే కాదన్నట్లుగా డెవలపర్లు తీరు ఉండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రీలాంచులు చేసే వారిపై క్రెడాయ్ హైదరాబాద్ పెద్దలు నోరు మెదపడంలేదు. దీంతో, అధిక శాతం బిల్డర్లు ఇష్టం వచ్చిన రేటుకు ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి బిల్డర్ల వలన ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెరా నుంచి అనుమతులతో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కొల్లూరు, వెలిమల, కిస్మత్‌పూర్ వంటి ప్రాంతాల్లో ప్రీలాంచుల వల్ల గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో రెరా ఫ్లాట్లను కొనడానికి ముందుకు రావట్లేదు. ఇదే పరిస్థితి నగరమంతటా నెలకొందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.

నగరంలో జరిగిన ప్రీలాంచ్ స్కాముల వివరాలు..

హైదరాబాద్‌లో పలు రియల్ సంస్థలు ప్రీలాంచుల పేరిట ప్రజలను మోసం చేశాయి. అయితే ఏ సంస్థ ఎంత మేరకు ప్రజల్ని మోసం చేసిందో ఈ కింది పట్టిక చూస్తే అర్థమవుతుంది.

సాహితీ గ్రూప్  రూ.1,500 కోట్లు

జయాగ్రూప్  రూ.300 కోట్లు

మైత్రీ ప్రాజెక్ట్స్  రూ.100 కోట్లు

భువనతేజ  రూ.200 కోట్లు

ఓబిలీ ఇన్‌ఫ్రా  రూ.20 కోట్లు

జేవీ ఎస్టేట్స్  రూ.300 కోట్లు

జేజే ఇన్‌ఫ్రా  రూ.10 కోట్లు

భారతి బిల్డర్స్  రూ.300 కోట్లు

భారతి లేక్‌వ్యూ  రూ.60 కోట్లు 

అలాగే జీఎస్సార్ గ్రూప్, పారిజాత డెవలపర్స్, ఆర్‌జే గ్రూప్, ఫార్చ్యూన్ 99 హోమ్స్ వంటి సంస్థలు ప్రజల నుంచి ప్రీలాంచుల పేరిట సొమ్ము వసూలు చేశాయి. జీఎస్సార్ గ్రూప్‌పై ఇప్పటికే పోలీసు స్టేషన్లలో కేసులు ఫైల్ అయ్యాయి. పారిజాత డెవలపర్స్ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. ఫార్చ్యూన్ 99 హోమ్స్ నుంచి సొమ్ము రావాలంటూ కొందరు బయ్యర్లు నేటికీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. ఈ సంస్థకు చెందిన చైర్మన్, ఎండీలు.. కంపెనీల పేర్లను మార్చి వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌జే గ్రూప్, గాయత్రి ఇన్‌ఫ్రా వంటి బాగోతాలు కూడా వెలుగులోకి వస్తాయని రియల్ ఎస్టేట్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.