14 April, 2026 | 2:31 AM

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతోనే అభివృద్ధి

14-04-2026 12:00 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, ఏప్రిల్ 13 : ప్రభుత్వ కార్యాలయాలకు నూతన బిల్డింగ్ నిర్మాణముతోనే మండలాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం నాగారం మండల కేంద్రంలోని నాగారం బంగ్లా ఆవరణలో నూతనంగా తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణాలకు సుమారు 11.25 లక్షల వ్యయంతో భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలు పాలించిన బిఆర్‌ఎస్ మాజీమంత్రి జగదీష్ రెడ్డి పాలనలో, ప్రభుత్వ కార్యాలయాలు చేపట్టకపోవడం దురదృష్టకరమైన విషయం అన్నారు.

మం డల ప్రజల సౌకర్యార్థమే కార్యాలయాల ని ర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎస్సారెస్పీ కాలువ నిర్మాణానికి, జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల పాలనలో సుమారు 2000 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. తిరుమలగిరి ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు తాను ముఖ్యమంత్రితో పలు దపాలుగా చర్చించి నేడు కాలేజీ ప్రారంభించడంతో సుమారు 200 మంది పేద విద్యార్థులకు అవకాశం కలిగిందని తెలిపారు.

ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నేడు పంట పొలాలకు సాగునీరు అందించి, రైతు అధికంగా పంటలు పండించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రుద్రమ్మ చెరువులోకి ఎస్సారెస్పీ నీళ్లు వచ్చే విధంగా, ప్రత్యేక ప్యాకేజీని మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. తిరుమలగిరి ఇంటిగ్రేటెడ్ గురుకులం పాఠశాల నిర్మాణానికి సుమారు రెండు వందల కోట్ల నిధులతో పనులు సాగుతున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలో ఏ అవకాశం వచ్చినా తాను అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానన్నారు. అనంతరం ప్రజాపాలన 99 రోజులలో భాగంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ భద్రతా నియమాలపై వాన దారులకు, ప్రజలకు ప్రత్యేకంగా తెలియపరచి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, స్థానిక సర్పంచ్ సుజాత వెంకన్న, ఆర్డిఓ వేణుగోపాల్, తాసిల్దార్ దేవేంద్ర ప్రసాద్ ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, నాగారం మండల పార్టీ అధ్యక్షులు తోడుసు లింగయ్య యాదవ్, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.