26 July, 2026 | 7:09 PM

​కొందరికేనా 'అతి శీఘ్ర' దర్శనం..?

26-07-2026 06:38 PM

- ​నాయినపల్లి మైసమ్మ ఆలయ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం

పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ మైసమ్మ అమ్మవారి ఆలయంలో కొంతమంది సిబ్బంది ప్రవర్తనపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు మారుమూల గ్రామాల నుంచి ప్రతి ఆదివారం వేలాదిగా తరలివచ్చే భక్తులకు అక్కడి సిబ్బంది ప్రదర్శించే అతి ఉత్సాహం తీవ్ర ఇబ్బందులను గురిచేస్తోంది. ​అమ్మవారిని దగ్గరి నుంచి దర్శించుకోవాలనే తపనతో సామాన్య భక్తులు రూ.50 శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుని క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తుండగా ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది మాత్రం తమ బంధువులు, పరిచయస్తులకు క్యూలైన్లతో సంబంధం లేకుండా నేరుగా 'అతి శీఘ్ర' దర్శనం కల్పిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ​సామాన్య భక్తులకు ఒక న్యాయం, ఆలయ సిబ్బంది బంధువులకు మరో న్యాయమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను పక్కనబెట్టి పక్షపాతం చూపుతున్న సిబ్బందిపై ఆలయ ఉన్నతాధికారులు, ఈవో తక్షణమే చర్యలు తీసుకోవాలని, సామాన్య భక్తులందరికీ సమాన దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.