మానవత్వం చాటిన సర్వ మత సామాజిక సేవ సంఘం సభ్యులు
మఠంపల్లి,(విజయక్రాంతి): మానవత్వానికి మతం లేదని మరోసారి చాటి చెబుతూ సర్వ మత సామాజిక సేవ సంఘం సభ్యులు ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు.డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి వైద్యానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని పెదవీడు గ్రామానికి చెందిన షేక్ ఆసిఫా (9) ఇటీవల డెంగ్యూ జ్వరానికి గురైంది.ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అయితే తీవ్ర పేదరికంలో ఉన్న కుటుంబం ఆస్పత్రి ఖర్చులు,వైద్య బిల్లులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న సర్వ మత సామాజిక సేవ సంఘం మండల అధ్యక్షుడు సయ్యద్ వహాబ్,కౌసర్ మసీదు కమిటీ మాజీ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ ఆదివారం ఖమ్మంలోని ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
చిన్నారి త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ సమాజంలో ఆపదలో ఉన్న వారికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.చిన్నారి ఆసిఫా భవిష్యత్తు చదువులకు కూడా సంఘం తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు షేక్ ఇమామ్,షేక్ జానీ భాష, ముస్లిం యూత్ కమిటీ సభ్యులు సయ్యద్ ఉమర్,సమీర్,సుభాని తదితరులు పాల్గొన్నారు.






