13 April, 2026 | 1:54 AM

యాదగిరిగుట్ట దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు

13-04-2026 12:00 AM

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 12: ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు యాదగిరి కొండ భక్తులతో కిటకిటలాడింది.

కొండపైన ఓం శ్రీ లక్ష్మీ నరసిం హ స్వామియే నమః స్మరణ చేస్తూ భక్తులు తరించారు.. కొండపైన పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. స్వామివారి దివ్య క్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను వేదమంతోత్సవములు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు.

ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు. భక్తులు కల్యా ణోత్సవంలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవ లో స్వామివారిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర  శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలను పండితులు నిర్వహించారు.