భక్తులచే దేవస్థానం ఈవోకి గోటి తలంబ్రాలు అందజేత
భద్రాచలం, మార్చి 15, (విజయక్రాంతి): పాప విమోచన ఏకాదశి పర్వదినాన పురస్కరించుకొని భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ రామదాసు భర్త మండలి చెల్పూర్ వారు అత్యంత భక్తిశ్రద్ధలతో సేంద్రియ పద్ధతిలో పండించి గోటితో ఒలిపించిన రెండు క్వింటాల 10 కేజీల తలంబ్రాలను శ్రీ రాముల వారి కళ్యాణం లో వినియోగించుటకు భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్ రావు కి అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయంలో వేద బ్రాహ్మణులచే పూజలు అనంతరం అందజేశారు.
అలాగే భద్రాచలంలో జరిగే నిత్య అన్న ప్రసాద వితరణకు భక్తుల నుండి సేకరించిన సుమారు 14 క్వింటాళ్ల బియ్యాన్ని తానీషా భవనంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈవో దామోదర్ రావు మాట్లాడుతూ రామదాసు భక్తి మండలి వారు ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తున్నారని, ఆనాడు రామదాసు చూపిన బాటలో నడుస్తూ రామదాసు భక్తి మండలి వారు హిందూ సంప్రదాయాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వేద పండితులు ఆలయ అధికారులు రామదాసు భక్త మండలి కోటి కోటి తలంబ్రాలు దీక్ష సభ్యులు సుమారు 400 మంది మహిళ భక్తులు పాల్గొన్నారు.




