జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాల విద్యార్థిని ఎంపిక
సంగారెడ్డి, మార్చి 15 : కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కర్ణాటకలోని కర్ణాటక విశ్వవిద్యాలయం, ధార్వాడ్ లో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరానికి సంగారెడ్డిలోని తారా కళాశాలకు చెందిన బిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీత ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపినారు.
యువతలో జాతీయ సమైక్యతను, భిన్నత్వంలో ఏకత్వ భావనను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలలో జాతీయ సమైక్యత శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ విశ్వవిద్యాలయంలో ఈనెల 11 నుండి 17వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ సమైక్యతా శిబిరానికి తమ కళాశాల విద్యార్థిని గీత ఎంపికై ఆ శిబిరంలో పాల్గొంటున్నారని, తెలంగాణ నుండి బయలుదేరిన పదిమంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల బృందంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు.
అందులో తమ కళాశాలకు చెందిన గీత ఉండడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. ఈ జాతీయ సమైక్యతలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తూ తెలంగాణకు మంచి గుర్తింపును తెస్తున్నారని, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ప్రదర్శించే సంస్కృతి సాంప్రదాయాలు, భాష, ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారని, దీనివల్ల యువతలో సమైక్యత భావం పెరుగుతుందన్నారు.
తమ కళాశాల విద్యార్థిని ఎంపిక చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్, వైస్ ఛాన్స్లర్ కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సిహెచ్ వెంకటేశ్వర్లుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.




