12 April, 2026 | 6:23 PM

ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు

12-04-2026 04:51 PM

- కన్నేపల్లిలో నూతన పోలీసు భవనన్ని ప్రారంభించిన డీజీపీ బి. శివధర్ రెడ్డి

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ఆదివారం  మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి శాసన సభ్యులు గడ్డం వినోద్, మల్టీజోన్-I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కలిసి కన్నెపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

పూజారులు పూర్ణకుంభంతో ఆయనకు ఆతిథ్యాన్ని అందించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కన్నెపల్లిలో పోలీస్ స్టేషన్ కోసం నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ, ఎమ్మెల్యే, కలెక్టర్,పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ భాస్కర్ రావును కుర్చీలో కూర్చోబెట్టి డీజీపీ, ఐజీ, ఎమ్మెల్యే ,కలెక్టర్, సీపీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ... శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా ఉండి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించారని తెలిపారు. ప్రజా రక్షణలో సాంకేతికతను వినియోగించి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నూతన భవనం ద్వారా మెరుగైన పోలీసింగ్, ప్రజలకు సేవల వేగవంతం సాధ్యమవుతుందని, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి డీ జీ పీ మొక్కలను నాటారు.