25 July, 2026 | 9:41 PM

విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా

25-07-2026 09:02 PM

విద్యార్థుల సుదీర్ఘ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం

 విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): నీట్, సీబీఎస్‌ఈ పరీక్షా పేపర్ల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్య పోరాట విజయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. శనివారం ఆయన ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 49 రోజులుగా విద్యార్థులు నిర్వహించిన మిలిటెంట్ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు మరొక శాఖను కేటాయించవద్దని డిమాండ్ చేశారు.

దేశంలో విద్యావ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరగాలని ఆకాంక్షించారు. నీట్ పేపర్ లీకేజీ సంఘటనల వల్ల తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ. కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అలాగే విద్యా రక్షణ కోసం, తమ హక్కుల కోసం ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం భేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.