24-04-2025 12:45:10 AM
ఇల్లెందు, ఏప్రిల్ 23(విజయక్రాంతి): ఇల్లందు పట్టణం, మండలంలో నెలకు నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ , ఎంపీడీవో కార్యాలయం ఎదుటలో ధర్నా నిర్వహించారు.గత నెల రోజులుగా సీపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపాలిటీ వార్డుల్లో, రూరల్ గ్రామాలలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి సామాజిక,వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఇల్లందు కొత్త బస్టాండ్ సుందరయ్య స్థూపం వద్ద నుంచి గోవింద్ సెంటర్ మీదుగా ఎం డి ఓ, మున్సిపాలిటీ కార్యాలయాల ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.
అనంతరం ఎం డి ఓ దన్ సింగ్, మున్సిపల్ మేనేజర్ అంకుశావళి కు వినతి పత్రాలను విడివిడిగా సమర్పించారు. తదుపరి పార్టీ మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జే రమేష్ లు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీ లను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు చిత్తశుద్ధి చూపక పోవడం సమంజసం కాదన్నారు.
అడిగిన వారందరి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సీఎస్పి బస్తీ రాజీవ్ నగర్ శివారు గుడిసె వాసులకు ఇంటి నంబర్లూ త్రాగునీరు కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పైలెట్ ప్రాజెక్టు కింద పూబెల్లి ఎంపిక చేసి అక్కడ అర్హులైన వారికి 10మందిని ఈ పథకం లోకి తీసుకోక పోవడం సరికాదని అన్నారు. పూబెల్లి గ్రామంలో ఇసుకను దళారులు తోడుకు పోతున్నారని ఆ ఇసుక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉపయోగించాలని వారు కోరారు.
పూసపల్లి ఓసీ ఎక్సటెన్షన్ పేరుతో అక్కడ ఇండ్ల నిర్మాణాన్ని, చిన్న చిన్న మరమత్తులు కూడా చేయకుండా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అక్కడ నిర్వాసితులకు 2013 భూ నిర్వాసిత పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తిలక్ నగర్, మున్సిపాలిటీ పరిధి లోని అన్ని వార్డులకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని, డ్రైనేజీ పారిశుధ్య పనులు చేపట్టాలని, వీధి దీపాలు అమర్చాలని,మండలం, పట్టణం లో కోతులు, కుక్కలు, పందులు, దోమల బెడద నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోపార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి,తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, సుల్తాన ఆలేటి సంధ్య, మాదరపు వెంకటేశ్వర్లు, కోడెం బోస్, కళ్ళేపల్లి మరియ, తాండ్ర కాంత, ఆర్ బి జె రాజు, రాజమొగిలి, కడారీ వెంకటమ్మ, వీరభద్రం, వెంకన్న, కోటమ్మ, నీలరాని, మన్యం మమత, భద్రు తదితరులు పాల్గొన్నారు.