9 June, 2026 | 1:43 AM

ఢీ అంటే ఢీ

09-06-2026 12:53 AM

ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్

టెల్‌అవీవ్/ టెహ్రాన్, జూన్ ౮: పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నా యి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతున్నది. ఇరాన్‌లోని సైనిక లక్ష్యాల పై సోమవారం ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. వరుస పేలుళ్లతో టెహ్రాన్, తబ్రిజ్, ఇస్ఫాహాన్ నగరాలు దద్దరిల్లాయి. ఖుజెస్తాన్ ప్రావిన్స్ మషహర్ పెట్రోకెమికల్ సముదా యంపైనా ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేపట్టింది. దాడుల్లో పెట్రోకెమికల్ ప్లాంట్‌లోని కీలక భాగాలు ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులకు దూరంగా ఉండాలని ఫోన్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సూచించిన కొద్ది గంటలకే దాడులు జరగడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య త్వరలో శాంతి చర్చలు జరుగతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ దాడులు మళ్లీ అలజడి సృష్టించాయి. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు దిగింది. ఏప్రిల్ తర్వాత మళ్లీ మొదటిసారి క్షిపణులు ప్రయోగించింది.

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ౧౦ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇరాన్ తన విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇజ్రాయెల్ కూడా తమ దేశంపై క్షిపణులను వాడినట్లు ఆరోపించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా తమ దాడులను చేసినట్లు ప్రకటించింది.