మధ్యలోనే తప్పుకున్నారేం?
‘ఈ రేస్’ కేసులో ఎఫ్‌ఈవో సీఈవోను ప్రశ్నించిన ఏసీబీ
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఫార్ములా ఈ రేస్ నుంచి మధ్య లోనే ఎందుకు తప్పుకున్నారని ఫార్మూలా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థ సీఈవో ఆల్బర్టోను సోమవారం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సంస్థ సీఈవో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకాగా ఏసీబీ అనేక ప్రశ్నలు సంధించింది.
వాస్తవానికి ఎఫ్‌ఈవో ప్రతినిధులు నెల క్రిత మే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, విచారణకు హాజరయ్యేందుకు కాస్త సమయం కావాలని, తాము నేరుగా విచారణకు హాజరు కాలేమని, వర్చువల్‌గా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ఎఫ్‌ఈవో ప్రతినిధులు ఏసీబీని అభ్యర్థించారు. ఏసీబీ అందుకు అంగీకరించగా.. తాజాగా సంస్థ సీఈవో వర్చువల్ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ‘రాష్ట్రప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం నుంచి మధ్యలోనే ఎందుకు వైదొలగాల్సి వచ్చింది? ఒప్పందం ప్రకారం నాలుగు సీజన్ల పాటు రేసు నిర్వహించాల్సిందే కదా ?’ అని ప్రశ్నించారు. సీఈవో సమధానమిస్తూ.. ‘మా సంస్థ నాలుగు సీజన్లు నిర్వహిస్తుందని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ.. మొదటి సీజన్‌లోనే మేం భారీ నష్టాలు చవిచూశాం.
అందుకే మిగతా మూడు సీజన్ల నిర్వహణ నుంచి వైదొలిగాం’ అని సమాధానమిచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులు స్పందిస్తూ.. ‘అవసరమైతే మీరు మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది’ అని సీఈవోకు తెలిపారు.
ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పటికే అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించింది. తాజాగా ఎఫ్‌ఈఓ సీఈవో నూ విచారించింది. మున్ముందు కేసు ఎ లాంటి మలుపులు తీసుకుంటుందోనని ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.




