3 August, 2026 | 2:34 PM

వర్షాలతో పత్తి రైతులు అధైర్యపడొద్దు

03-08-2026 01:25 PM

కాపర్ ఆక్సిక్లోరైడ్‌తో వేరు కుళ్లు నివారణ సాధ్యం

భీమ్రా గ్రామసభలో వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్

కంగ్టి,(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పత్తి రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ అన్నారు. కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన రైతులకు పత్తి పంట సంరక్షణపై పలు సూచనలు చేశారు.వర్షపు నీరు పొలాల్లో నిల్వ ఉండడం వల్ల పత్తి మొక్కలు నీటి ఒత్తిడికి గురై వేరు కుళ్లు తెగులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిని నివారించేందుకు కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులో నీటిలో కలిపి మొక్కల వేర్ల వద్ద పోయాలని సూచించారు.దీంతో వేరు కుళ్లు నివారించడంతో పాటు మొక్కలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందకుండా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని, అవసరమైన సలహాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిమిదొడ్డి బాబు, పంచాయతీ కార్యదర్శి తస్లీమ్, ప్రజాప్రతినిధులు,రైతులు  పాల్గొన్నారు.