దివ్యాంగులు ధైర్యంగా ముందుకెళ్లాలి
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, మార్చి 9 (విజయక్రాంతి): దివ్యాంగులు మానసికంగా ధైర్యంతో ముందుకెళ్లి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. సోమవారం అల్వాల్ లోని సఖీ సెంటర్ లో జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు 56, వీల్ సైకిళ్లు 14 పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, ఆర్డిఓ ఓం ప్రకాష్, అల్వాల్ తహాసీల్దారు రాములు, డిడబ్లూఓ శారద, హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికి మానసికంగా ధైర్యంగా ఉంటూ తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని, అందుకు అవసరమైన సహాయ సహాకారాన్ని తప్పకుండా అందిస్తామని అన్నారు. ఆర్థికంగా ఎదగడానికి అనేక ఆలోచనలు ఉంటాయి
సొంతంగా బిజినెస్, సొంతంగా స్టార్టప్, ఒక దుకాణం పెట్టుకోవడానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహాకారం అందిస్తామన్నారు. అంతేకాకుండా మీ పిల్లలు ఎక్కడైనా చదువుతూ కెరీర్ కౌన్సెలింగ్, కోర్సెస్ నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ వంటి వాటిని ఇంప్రూవ్ చేసి వివిధ రంగాలలో రాణించడానికి కావలసిన సామర్థ్యాన్ని పెంపొందించడానికి తప్పకుండా వారికి సహాకారం అందిస్తూ తోడ్పడతామని కలెక్టర్ అన్నారు.
మీ పిల్లలను చదివించ డంలో వారికి కెరీర్ నిర్మాణంలో కూడా మీకు కావలసిన కౌన్సిలింగ్ కు మార్గనిర్దేశాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వ మార్గనిర్దేశాల మేరకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామన్నారు. ఈసారి వీల్ ఛైర్లు, ట్రై సైకిళ్లు అందని వారికి తప్పకుండా తదుపరి అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి కలెక్టర్ దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లు పంపిణీ చేసారు. కలెక్టర్ సఖి సెంటర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.




