ఆర్టీసీ బస్సుల్లో 30% రాయితీ
- హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో వర్తింపు
- బంకుల వద్ద పెట్రోల్ కోసం బారులు తీరొద్దు
- ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించండి
- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డిజీల్ వార్తల నేపథ్యం లో హైదరాబాద్ నగర పరిధిలోని ప్రయాణికులకు ఈ శుభవార్త చెప్పింది. మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరపై 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈమేరకు బుధవారం ప్రకటించారు. పెట్రోలు కష్టాలు పడడం ఎందుకు దండగ...ఆర్టీసీ బస్సులు ఉండగా అంటూ ఆయన పేర్కొన్నారు.
బంకుల వద్ద బారులు తీరొద్దని, సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన కోరారు. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైందని తెలిపారు.
పెట్రోల్ కోసం కిలో మీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన స మయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షే మంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు. ఇం ధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదేనని, వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30 శాతం రాయితీ ఒక గొప్ప అవకాశమని, పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు అన్నారు. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.




