20 April, 2026 | 1:39 AM

ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు వివక్ష

20-04-2026 12:00 AM
  1. నాయకులకు రాచ మర్యాదలు.. సామాన్యులకు సాకులు..
  2. నాయకులు ఫోన్ చేస్తే గంటల్లో పని పూర్తి
  3. ప్రజలకు నెలల తరబడి మండలంలోని ప్రభుత్వ అధికారుల తీరుపై ప్రజల ఆవేదన...
  4. నాయకుల కనుసన్నల్లోనే మండల అధికారులు..

బెజ్జంకి, ఏప్రిల్19 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై సామాన్య ప్రజల ఆగ్రహం రోజు రోజుకూ పెరుగుతోంది. మండల రెవెన్యూ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, రాక్షణ శాఖ,మండల విద్య,ఆరోగ్య, వ్యవసాయ అధికారుల కార్యాలయం సహా అనేక శాఖల్లో సాధారణ పౌరులు అనుభవిస్తున్న ఇబ్బందులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాయకుల కనుసన్నల్లోనే మండల అధికారుల పనితీరు దీనికి నిదర్శనం.

పెన్షన్, కళ్యాణ లక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇండ్ల పర్మిషన్, భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే కాకుండా కులం, ఆదాయం, జనన, నివాస ధృవపత్రాల కోసం దరఖాస్తు చేసిన ప్రజలు వారాల తరబడి తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఒక సర్టిఫికెట్ కోసం పలుమార్లు కార్యాలయాల మెట్లు ఎక్కినా ఫలితం లేకుండా తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. సామాన్య ప్రజలు నెలల కొద్ది తిరిగిన పని నాయకులు చెపితే త్వరలో పూర్తి అవుతుంది. ధ్రువపత్రాల ఆలస్యంపై ప్రశ్నిస్తే  ఫైల్ పెండింగ్లో ఉంది, సార్ మీటింగ్లో ఉన్నారు, రేపు రండి అనే సాకులతో తప్పించుకోవడం సాధారణమైందని ప్రజలు చెబుతున్నారు.

అయితే అదే సమయంలో మండలము లోనీ పేరు మోసిన, పేరున్న, గల్లి  నాయకులు లేదా వారి అనుచరులు కార్యాలయానికి వస్తే, ఫోన్ చేస్తే గంటల వ్యవధిలో పనులు పూర్తవుతున్నాయి. బలం, అధికారం, పేరు వున్నాయకులతోనే  గంటల తరబడి కార్యాలయాల్లో ముచ్చతీస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సామాన్యులకు గేటు వద్దే అడ్డుకట్ట, లీడర్లకు రెడ్ కార్పెట్ స్వాగతం ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు, పన్నులు చెల్లించినప్పటికీ సేవలలో వివక్ష ఎందుకు , అధికారుల ఈ ద్వంద్వ వైఖరి ఎవరి ప్రయోజనానికి అని సామాన్య ప్రజల ఆవేదన.  మా పనులు చేయించుకోవడానికి మధ్యవర్తులు, సిఫార్సులు అవసరమా సాధారణ పౌరుడిగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం తప్పా అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.  సామాన్య ప్రజల ను ఇకపై విచారణల పేరుతో,వివిధ కారణాల తో కాలయాపన చేస్తే ప్రజా ఆందోళనలు తప్పవని ప్రజా సంఘాల నాయకుల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి.