21 April, 2026 | 7:27 PM

స్కాములు, ఫార్మూలాలపై అసెంబ్ల్లీలో చర్చ పెట్టండి

18-12-2024 12:44 AM
  1. సీఎం పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పా?
  2. కొడంగల్ నుంచే రేవంత్‌రెడ్డి పతనం మొదలు
  3. కొడంగల్ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీదే 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

హైదరాబాద్, డిసెంబర్ 17(విజయక్రాంతి): ఎవరిని అరెస్టు చేయాలో చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కావడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే తారక రామారావు మండిపడ్డారు. సీఎం పేరు మర్చిపోవడమే సినీ నటుడు అల్లు అర్జున్ చేసిన తప్పా అని ప్రశ్నించారు.

స్కాములు, ఫార్మూలాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నుంచే రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభం అవుతుందని అన్నారు. కొడంగల్‌లోని బీఆర్‌ఎస్ కార్యకర్తలను కాపాడుకొనే బాధ్యత పార్టీదేనని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లగచర్ల నుంచే బీఆర్‌ఎస్ జైత్రయా త్ర ప్రారంభమవుతుందని, అక్కడి నుంచే సీఎం రేవంత్‌రెడ్డి పతనం మొదలైతుందని అన్నారు. రేవంత్‌కు దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సవాల్ విసిరారు. రైతన్నలు, నేతన్నలు,ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల నుంచి అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేసిందో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపైన చర్చించిన తర్వాత రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న కుంభకోణాలు, ఫార్ములా- ఈ వంటి అంశాలపై చర్చ పెడితే తాము సిద్దంగా ఉన్నామన్నారు. కొడంగల్ ప్రజల కోసం నిలబడిన మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఉక్కుమనిషిగా మారి రేవంత్‌రెడ్డిని భవిష్యత్‌లో తుక్కు తుక్కు చేస్తాడని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి నక్క వినయాలు ప్రదర్శించి, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అధికారం చేపట్టిన తరువాత రైతు రుణమాఫీ మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కారని, రుణమాఫీ వంద శాతం పూర్తి కాలేదని విరుచుకుపడ్డారు.

రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లె కానీ రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా ఈ సవాల్‌కు తాను సిద్ధమని చెప్తే ముఖ్యమంత్రి పత్తా లేకుండా పారిపోయారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో 30 శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదని.. రాహుల్‌గాంధీ మొదలుకొని కాంగ్రెస్ కార్యకర్త దాకా సిగ్గు లేకుం డా అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధిచెప్పడం ఖాయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రైతులు బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్ అన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ర్ట ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై హామీలను అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ రావాలి అని డిమాండ్ చేస్తున్న రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీఆర్‌ఎస్ కార్యకర్తలనే తట్టుకోలేకపోతున్నారని, కేసీఆర్ బయటకు వస్తే వణికిపోతారని అన్నారు.

తమ పార్టీ నేత పట్నం నరేందర్‌రెడ్డితోపాటు లగచర్ల రైతుల బెయిల్ కోసం అన్ని రకాలుగా బీఆర్‌ఎస్ ముందు నుంచి కొట్లాడుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికే వారి బెయిల్‌కు సంబంధించిన వాదనలు పూర్తి అయ్యాయని, త్వరలో కోర్టులో న్యాయం లభిస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. తమ వెంట నిలబడిన న్యాయవాదులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తన బెయిల్ గురించి కాకుండా రైతుల బెయిల్ గురించి ఆందోళన చెందుతున్న గొప్ప నాయకుడు నరేందర్ రెడ్డి అని ప్రశంసించారు. 

ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కొత్త నాటకం 

లగచర్ల భూములు గుంజుకోవాలన్న దుర్మార్గ ఆలోచనతోనే రేవంత్‌రెడ్డి కుటుంబం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, ఫార్మా విలేజ్ రద్దు చేశామని చెప్పి మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి జెడ్పీటీసీ కాదని, కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదని.. పోలీసులు అండతో అరాచకం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కొడంగల్‌లో సేకరిస్తున్న రైతుల భూములు పరిశ్రమల కోసం కాదని.. అల్లుడి కోసం, అదానీ కోసమేనని ధ్వజమెత్తారు. పరిశ్రమలు పెట్టడం, ఉపాధి కల్పించడమే రేవంత్‌రెడ్డి ప్రాధాన్యం అయితే వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూమిలో పరిశ్రమలు పెట్టి ఉపాధి చూపించాలని సవాల్ విసిరారు. లగచర్ల అంశాన్ని వదిలిపెట్టబో మని, అసెంబ్లీ నడిచినన్ని రోజులు లేవనెత్తుతామని స్పష్టంచేశారు.

అరెస్టు చేసిన లగచర్ల రైతులను, పార్టీ నేతలను వెంటనే పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నవీన్‌రెడ్డి, గోరేటి వెంకన్న, నాయకులు పొన్నాల లక్ష్మయ్య, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.