నారాయణ.. నారాయణ.. నారాయణ స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య
- చదువుల ఒత్తిడి తట్టుకోలేక
- ఇదేం ఘోరం!
- ర్యాంకుల వేటలో 7వ తరగతి విద్యార్థి లోహిత్‌రెడ్డి బలి
- రాత్రికిరాత్రే మృతదేహం ఉస్మానియాకు తరలింపు
- వేధింపుల వల్లే నా కొడుకు మరణించాడు: తండ్రి మధుసూదన్‌రెడ్డి
- విద్యార్థి సంఘాల ఆందోళన
ఎల్బీనగర్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): కార్పొరేట్ విద్యా సంస్థల ర్యాంకుల వేటలో.. చదువుల ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది విద్యార్థులు ప్రాణాలను అర్ధాంతరంగా ముగిస్తు న్నారు. తాజాగా హయత్‌నగర్‌లోని నారాయణ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న లోహిత్‌రెడ్డి అలియాస్ లోహితస్యరెడ్డి (12) సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
తమ పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న తల్లిదండ్రుల ఆశలు మధ్యలోనే ఆవిరవుతున్నాయి. కార్పొరేట్ యుగంలో తల్లిదండ్రుల ఆశలను అలుసుగా తీసుకుంటున్న నారాయణ విద్యాసంస్థలు 5వ తరగతి నుంచే ఐఐటీ, ఒలంపియాడ్, నీట్, డిజిటల్ క్లాస్‌లు అంటూ ఆకర్షణీయమైన పేర్లు పెట్టి, తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు దండు కుంటున్నారు.
చిన్నారులను చదువుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ చిన్నవయస్సులోనే ఆత్మహత్యలు చేసుకునే విధంగా టార్చర్ చేస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో గత కొద్దికాలంగా వందల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
హయత్‌నగర్ పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వననర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన పండుగ మధుసూదన్‌రెడ్డి తన కొడుకును ఉన్నతంగా చదివించాలని ఒక్కగానొక్క కొడుకు లోహిత్‌రెడ్డి అలియాస్ లోహితస్యరెడ్డి (12) హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉన్న నారాయణ పాఠశాలలో చేర్పించాడు.
స్కూ ల్‌లోని హాస్టల్‌లో ఉంటూ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌లో విద్యార్థిని చేర్చుకోవడానికి రూ.3 లక్షల ఫీజు తీసుకుంటున్నారు. అయితే, లోహిత్‌రెడ్డి చదువుల్లో టాపర్ అవడంతో మరింత బాగా చదవాలని ఇటీవల పాఠశాల సిబ్బం ది ఒత్తిడి చేస్తున్నారు. కాగా, లోహిత్ చదువు ఒత్తిడితోపాటు అధ్యాపకులు, తోటి విద్యార్థుల ప్రవర్తనతో విసిగిపోయాడు.
తనను మరోచోటుకు తరలించాలని తండ్రి మధుసూదన్‌రెడ్డిని కోరాడు. కొడుకు ఇబ్బందిని గమనించిన తండ్రి మరో ప్రాంతంలో ఉన్న పాఠశాలకు మార్చాలని పలుమార్లు కోరినా ప్రిన్సిపాల్ అంగీకరించలేదు. దీంతో 7వ తరగతి పూర్తి చేసిన తర్వాత పాఠశాలను మార్చుతానని కొడుకుకు ధైర్యం చెప్పారు.
ఈ క్రమంలోనే సోమవారం లోహిత్‌రెడ్డి పాఠశాలలో జరిగిన ఘటనలకు తీవ్ర మనస్తాపం చెందాడు. ఫిజిక్స్ అధ్యాపకుడు తోటి విద్యార్థుల ఎదుట తరగతి లీడర్‌తో కొట్టించాడని, తనను ఏ ప్లస్ గ్రేడ్ నుంచి గ్రేడ్ తగ్గించాడని, పలుమార్లు తననే టార్గెట్ చేస్తున్నారని పాఠశాలలో జరిగిన విషయాలను లోహిత్‌రెడ్డి సోమవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి వివరించాడు.
సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో పిల్లలందరూ రాత్రి భోజనం చేయడానికి కిందికి వెళ్లారు. ఇంతలోనే లోహిత్‌రెడ్డి హాస్టల్‌లో తాను ఉంటు న్న గదికి వెళ్లాడు. టవల్‌తో సిలీంగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భోజ నం చేసిన తర్వాత విద్యార్థులు తమ తమ గదుల్లోకి వెళ్లగా, లోహిత్‌రెడ్డి ఉరేసుకున్న విషయాన్ని గమనించి హాస్టల్ సిబ్బందికి తెలిపారు.
వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చి, స్థానికంగా ఉన్న సన్‌రైజ్ దవాఖానకు తరలించారు. అప్పటికే లోహిత్‌రెడ్డి చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తం డ్రి మధుసూదన్‌రెడ్డికి విషయాన్ని చెప్పారు.
సోమవారం రాత్రి లోహిత్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలిం చారు. పాఠశాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీ బం దోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో వనస్థలిపురం సీఐ శ్రీనివాస్, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణ పాఠశాలకు అనుమతుల్లేవ్
హయత్‌నగర్‌లో నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలకు పూర్తిగా అనుమతులు లేవని తెలుస్తుంది. గతంలో ఇదే భవనంలో చైతన్యస్కూల్‌ను నిర్వహించారు. కాగా, వారు పక్కా భవనం నిర్మించుకోవడంతో భవనాన్ని ఖాళీ చేశారు. ఇదే భవనాన్ని రిపేరు చేయించి, నారాయణ పాఠశాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు పాఠశాల భవనానికి సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. విద్యార్థి మృతిపై స్థానిక ఎంఈవో పాఠశాలకు వచ్చి పరిశీలించారు. కానీ, విద్యార్థి మృతితోపాటు పాఠశాల అనుమతులపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారుగా..: విద్యార్థి సంఘాలు
లోహిత్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం ఉదయం నారాయణ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతిచెందగా అల్లు అర్జున్‌ను జైలుకు పంపిన పోలీసులు, నారాయణ సంస్థలపై చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికే వందల మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థల వేధింపులకు బలి అయ్యారని అయినా పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల మరణాలకు కారణమవు తున్న విద్యాసంస్థల యాజమాన్యంపై ఎన్ని కేసులు నమోదు చేశారు.. వాటిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో విద్యార్థి నాయకులను అరెస్టు చేసి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వేధింపుల వల్లే నా కొడుకు మరణించాడు : విద్యార్థి తండ్రి మధుసూదన్‌రెడ్డి
విషయం తెలుసుకున్న లోహిత్‌రెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి సోమవారం రాత్రి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హయత్‌నగర్‌లోని నారాయ ణ స్కూల్‌కు వచ్చారు. రాత్రి ఫోన్‌లో మాట్లాడిన కుమారుడిని నిర్జీవంగా చూసి తల్లడిల్లిపోయారు. అధ్యాపకుల వేధింపులతోనే తన కొడుకు చనిపోయాడని ఆరోపించారు.
చదువు పేరుతో వేధించారని, తోటి విద్యార్థుల ఎదుట అవమానించారని, పలుమార్లు లోహిత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అవమానించారని ఆరోపించారు. వేధింపులు తట్టుకోలేక తనను వేరే స్కూల్‌కి మార్చాలని పలుమార్లు ఆడిగాడని తెలిపారు. నారాయణ యజమాన్యం సరిగా స్పందించక పోవడంవల్లే మరో పాఠశాలకు మార్చలేదన్నాడు.
తన కొడుకు మృతిపై నారాయణ పాఠశాల సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉరేసుకుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. రూ. లక్షల్లో ఫీజు తీసుకుంటూ పిల్లలను చూడలేరా? అని రోదించాడు. లోహిత్‌రెడ్డి మృతికి నారాయణ పాఠశాలదే బాధ్యత అని అన్నాడు.
పోలీసులు విచారణ చేసి, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు హయత్‌నగర్ సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. లోహిత్‌రెడ్డి మృతిపై విచారణ చేస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






