21 April, 2026 | 6:09 PM

అమరుల స్థూపం ఆవిష్కరణకు నోచుకోదా?

18-12-2024 12:00 AM

యాభై ఏళ్లు గడిచినా అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు నోచుకోకపోవడం తెలుగు జాతికే తీరని మచ్చగా మారింది. తెలంగాణ కోసం ప్రాణాల్పరించారు. ఉద్యమాలు చేశారు. వాళ్ల జ్ఞాపకార్థం కట్టిన స్థూపాన్ని ఆవిష్కరణ చేయకపోడం చాలా అన్యాయం. దాన్ని ముందుగా ఆవిష్కరించాలి. ఎందుకంటే ఇప్పుడున్న వారికి చాలామందికి తెలియదు. అది అమరవీరుల స్థూపం అని. ఇంకా కొన్నిరోజులు అయితే దాన్ని మర్చిపోతారు. లేదంటే భవిష్యత్‌లో అది ఒక అలంకరణ వస్తువుగా మిగిలిపోతుంది.  తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఇప్పటికైనా ఆవిష్కరిస్తే సంతోషకరం--ఎక్కా యాదగిరిరావు

ముందుగా విజయక్రాంతి పత్రికకు ధన్యవాదాలు. ‘యాది మరిచిన తెలంగాణ’ పేరుతో నాపై వచ్చిన కథనం.. నా యాభై ఏళ్ల కష్టాన్ని కళ్లకు కట్టింది. ఒక విధంగా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. కథనం పబ్లిష్ అయ్యాక.. అందరి నుంచి విశేష స్పందన లభించింది. చాలామంది నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎంతోమంది అభినందించారు. 

గత ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు.. 

గత ప్రభుత్వం కళాకారుడిగా నాతో పాటు అమరవీరుల స్థూపాన్ని పూర్తిగా మర్చిపోయింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఆ స్థూపాన్ని మర్చిపోవడం మంచి విషయం కాదు. రాజకీయాల కోసం స్థూపాన్ని వాడుకొని.. మర్చిపోవడం ఎంతవరకు సమంజసం. రెండో విషయం ఏంటంటే.. ఢిల్లీలో తెలంగాణ డిక్లరేషన్ అయిన వెంటనే హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు.

అక్కడే  నేనూ ఉన్నాను. నన్ను కౌగిలించుకుని.. నాటి గవర్నర్ సౌందర్యరాజన్ దగ్గరకు వెళ్లి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక అంతే తర్వాత అమరవీరుల స్థూపాన్ని మర్చిపోయారు. ఇదంతా పాత కథ. 

ప్రభుత్వానికి రిక్వెస్ట్.. 

50 ఏళ్ల నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు నోచుకోలేదు. బ్రహ్మారెడ్డి పీరియడ్‌లో ఉద్యమకారులను పిట్టలను చంపినట్టు చంపేశాడు. దానికిగాను అంజ య్య, మాణిక్ రావు, మాధన్‌మోహన్, లక్ష్మినారాయణ ముదిరాజ్ వీళ్లందరు.. అసెంబ్లీలో తెలంగాణ అమరవీరుల కోసం స్థూపం కట్టాలి అని ఎగబడ్డారు. అలా అవన్నీ జరిగాయి. పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ల డిజైన్లను చూపించారు. దాంట్లో నా డిజైన్ ఫైనల్ అయింది. అందరు అంగీకరించారు.

అయితే యాభై ఏళ్లు గడిచినా అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు నోచుకోకపోవడం తెలుగు జాతికే తీరని మచ్చగా మారింది. తెలంగాణ కోసం ప్రాణాల్పరించారు. ఉద్యమాలు చేశారు. వాళ్ల జ్ఞాపకార్థం కట్టిన స్థూపాన్ని ఆవిష్కరణ చేయకపోడం చాలా అన్యాయం. దాన్ని ముందుగా ఆవిష్కరించాలి. ఎందుకంటే ఇప్పుడున్నా వారికి చాలామందికి తెలియదు. అది అమరవీరుల స్థూపం అని. ఇంకా కొన్నిరోజులు అయితే దాన్ని మర్చిపోతారు.

లేదంటే భవిష్యత్‌లో అది ఒక అలంకరణ వస్తువుగా మిగిలిపోతుంది. అలా కాకూడదు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కోసం స్థూపం చుట్టూ ఒక పలక ఏర్పాటు చేసి.. దానిపై చరిత్రను రికార్డు చేయాలి. 1960లో 360 మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయారని ప్రజలకు తెలిసే విధంగా పలక ఉండాలి. దానికోసమే ఈ మెమోరియల్ అని చెప్పుకోవాలి. ప్రభుత్వానికి నా రిక్వెస్టు, నా తపన ఏంటంటే.. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఇప్పటికైనా ఆవిష్కరిస్తే సంతోషకరం.   

మార్పులు జరగాలి.. 

సీఎం రేవంత్ వచ్చి రావడంతోనే అనేక మార్పులు తీసుకొచ్చారు.. దానిలో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహంపైనా దృష్టి సారించారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. నేను చెప్పేది ఏంటంటే.. మార్పులు.. చేర్పులు జరుగుతూనే ఉంటాయి. మార్పు సహజం. మార్పులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దేవుణ్ని కొలుస్తాం. ఎన్ని రూపాలు ఉన్నా కూడా దేవుడే అంటాం కదా. రూపాలు మారిన కూడా దేవుడొ క్కడే. దేవుడు నిజమైన స్వరూ పం. అలాగే తెలంగాణ తల్లి కూడా ఒకే రూపంలో ఉండకూడదనేది నా అభిప్రాయం.  

కళాకారుల కోసం..

కళాకారులకు ఒక అకాడమీ అనేది ఉండాలి. మా సీనియర్స్ కే.రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు, పీటీ రెడ్డి వంటి వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల కళలు ఎక్కడికి పోయా యి.. ఇప్పుడు లేవు కదా.. కళా సంపద కోసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. మాకు స్ఫూర్తి మా సీనియర్స్. మాతో పాటు వచ్చే జనరేషన్ తర్వాత తరానికి స్ఫూర్తి కావాలి. మొత్తంగా నేను చెప్పేది ఏమంటే.. ప్రభుత్వం ఒక మ్యూజియం కట్టాలి. దాన్ని ఆవిష్కరించాలి. ఇవన్నీ చేస్తేనే కళ  యుగయుగాలు మిగిలిపోతుంది.