గిగ్ వర్కర్లతో చర్చలు సఫలం
- డిమాండ్ల పరిష్కారానికి మంత్రి వివేక్ హామీ
- సంక్షేమ చట్టం అమలుకు త్వరలో మార్గదర్శకాలు
- సామాజిక భద్రత కల్పిస్తామని స్పష్టీకరణ
- యూనియన్ల సంతృప్తి, సమ్మె నిర్ణయం ఉపసంహరణ
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి సానుకూల హామీ లభించడంతో శనివారం (నేడు) నుంచి తలపెట్టిన సమ్మెను యూనియన్ ప్రతినిధులు ఉపసంహరించుకున్నారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో శుక్రవారం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి యూనియన్ల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధాన డిమాండ్లు, సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలపై చర్చించారు.
హామీలు ఇవీ..
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి వారి హక్కులను పరిరక్షించే లక్ష్యంతోనే ప్రభుత్వం గిగ్ వర్క ర్ల సంక్షేమ చట్టం తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. గిగ్ వర్కర్ల సమస్యలు, యూనియన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కార్మికుల ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, సమస్యలకు పరిష్కారించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చట్టం మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే వరకు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, యూనియన్లు ఓపికగా ఉండాలని కోరారు. కార్మికులకు మేలు జరిగేలా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి వివేక్ వెంకటస్వామితో జరిగిన చర్చలపై యూనియన్ల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల్లో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్, రవాణా శాఖ అధికారులు, గిగ్, ప్లాట్‌ఫామ్ యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.






