8 August, 2026 | 1:14 AM

పీఆర్సీ ఇంకెప్పుడిస్తరు?

08-08-2026 12:00 AM
  1. ప్రభుత్వం ఎన్నికల హామీని విస్మరించింది
  2. తక్షణమే మూడు పీఆర్సీలను ప్రకటించాలి
  3. పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య డిమాండ్ 
  4. ఇందిరాపార్కు వద్ద పెన్షనర్ల మహాధర్నా

ముషీరాబాద్,ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే ప్రకటించాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె. లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పెననర్ల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. పెన్షనర్లు ధీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆరోగ్య పథకం వర్తింపజేస్తామని, ఫిట్‌మెంట్‌తో పీఆర్సీతో కలిసి డీఏ, డీఆర్‌లు చెల్లిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మూడేళ్లు కావస్తున్నా హామీని ఆచరణలోకి తేకుండా పెన్షనర్లను మోసం చేసిందని విమర్శించారు. బకాయి ఉన్న మూడు పీఆర్సీలను ప్రకటించడంతో పాటు, గతంలో 398 వేతనంతో పనిచేసినస్పెషల్ టీచర్ల కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 2024 మార్చి తరువాత రిటైర్డ్ అయిన పెన్షన్‌దారులందరికీ బెనఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరారు.  ప్రభుత్వం స్పందించకపోతే  రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  మహాధర్నాలో పెన్షనర్ల జేఏసీ సెక్రటరీ జనరల్ తులసీ సత్యనారాయణ, ఆలిండియా సెక్రటరీ డి.సుధాకర్. పూర్ణచందర్‌రావు, రాజేంద్రబాబు. సలహాదారులు శుభాకర్రావుతో పాటు పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.