‘గిల్డ్’ డైరెక్షన్.. సర్కారు యాక్షన్!
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సినీపరిశ్రమలో చర్చోపచర్చలు
ఎగ్జిబిటర్లను, ఫిల్మ్ ఛాంబర్లను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడమేంటి?
నూతన మార్గదర్శకాలపై పునఃసమీక్ష చేయాలని డిమాండ్
చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు వారధిగా ఉండేది ఎగ్జిబిటర్లే. అలాంటి థియేటర్ నిర్వాహకుల పాలిట జీవో నం.౭౭ శాపంగా మారింది. థియేటర్ల ఆధునీకరణ, టికెట్ ధరల క్రమబద్దీకరణపై తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయమై ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలపై తెలుగు చిత్రపరిశ్రమలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ విషయమై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డికి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. సినీ పరిశ్రమకు వెన్నెముక ఎగ్జిబిటర్లే. అలాంటి వారిని కొత్త మార్గదర్శకాలు నష్టాల ఊబిలోకి నెట్టివేయను న్నాయి. ఈ కొత్త జీవో, టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకులకు వినోదం దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లనీ పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, రెండు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించకుండా ధరలను ఖరారు చేయడాన్ని తప్పుపడుతు న్నారు ఎగ్జిబిటర్లు. నాన్ ఏసీ, ఎయిర్ కూల్డ్, ఏసీ థియేటర్లకు దశాబ్దాలుగా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అన్ని ఎయిర్ కూల్ థియేటర్లను తప్పనిసరిగా ఏసీగా మార్చాలని నిబంధన విధించడం ఏకపక్ష నిర్ణయమే. చిన్న పట్టణాల్లో ఒక్కో స్క్రీన్ను ఏసీగా మార్చేందుకు సుమారు రూ.60 నుంచి -80 లక్షలు ఖర్చవుతుంది.
ఏసీ థియేటర్ల మార్చడం సాధ్యపడకే చాలా సింగిల్ థియేటర్లు మూతపడ్డాయి. కొవిడ్ తర్వాత ఎగ్జిబిషన్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రేక్షకుల రాకపోకల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో నిర్వహణ ఖర్చులు 25- నుంచి 30 శాతం పెరిగాయి.
జీవో 77లో టికెట్ ధరల పరిధుల్లో అస్పష్టత, గందరగోళం నెలకొంది. ప్రీమియం, నాన్ ప్రీమియం టికెట్ ధరల విషయంలో తీవ్ర గందరగోళం ఉంది, థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఏసీ ఛార్జీలు కూడా పెంచాలని గతంలోనే కోరారు. జీవో 77ను సవరించి మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా పెంచాలి. మల్టీఫ్లెక్స్ లకు ఇచ్చే ఆదాయంలో న్యాయమైన వాటా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇవ్వడం లేదు. టికెట్ ధరలు పెంచడం వల్ల ఎగ్జిబిటర్లకు ప్రయోజనం ఉండదు. తెలంగాణలో 400కుపైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి.
టైర్ 2, టైర్ 3 టౌన్‌లో 99 శాతం ఎయిర్ కూల్ థియేటర్లే ఉన్నాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ, నిర్వహణ ఖర్చుల భారాన్ని భరించేది ఎగ్జిబిటర్లే. థియేటర్ల ఆధునికీకరణ, నిర్వహణ, విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు ఎగ్జిబిటర్లే చెల్లిస్తారు. థియేటర్ల ఆర్థిక భారమంతా ఎగ్జిబిటర్లపైనే ఉంటుంది. అలాంటిది గిల్డ్ విజ్ఞప్తి ఆధారంగా టికెట్ ధరలను నిర్ణయించడం ఏకపక్ష నిర్ణయమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నైజాం ఏరియాలోని అన్ని థియేటర్లు కలిపి సుమారు 20 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అలాంటిది ఒక్క జీవోతో తమ సొంత ఆస్తికి టికెట్ ధరలను నిర్ణయించుకునే హక్కును లాక్కున్నారని ఎగ్జిబిటర్లు ఆవేదన చెందుతున్నారు.
సీఎం రేవంత్‌కు ఎగ్జిబిటర్ల లేఖ
సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో.77ను రద్దు చేయాలని తాజా లేఖలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణలోని 400కుపైగా థియేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లు సీఎం రేవంత్‌తోపాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ ద్వారా లేఖ పంపారు. తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, పలువురు నిర్మాతల కోసం ఎలా జీవో జారీ ఇస్తారని ఈ లేకలో ప్రశ్నించారు. తెలంగాణలోని అన్ని థియేటర్లపై కలిపి సుమారు 20 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
గడిచిన మూడేళ్లలో థియేటర్ల మరమ్మతుల కోసం ఎగ్జిబిటర్లు రూ.300 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ప్రేక్షకులకు మంచి సినిమా అనుభూతి కలిగించేందుకు రిక్లైనర్స్, డాల్బీ అట్మాస్ సిస్టమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చిన్న పట్టణాల్లో ఒక్కో స్క్రీన్ను ఏసీగా మార్చేందుకు సుమారు రూ.60-80 లక్షలు ఖర్చవుతుందని, ఏసీ థియేటర్ల మార్చడం సాధ్యపడకే చాలా సింగిల్ థియేటర్లు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ తర్వాత ఎగ్జిబిషన్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, కొత్త జీవో వల్ల గ్రామీణ తెలంగాణలో అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 77ను సవరించి మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా పెంచాలని కోరారు.






