26 August, 2026 | 2:26 AM

అర్థరహిత వ్యాఖ్యలు

26-08-2026 01:05 AM

అమెరికా పర్యటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు

  1. రాజకీయాలు ఆపాదించడం సరికాదు 
  2. భారత్ వ్యతిరేకి మమ్దానీతో భేటీ ఎందుకు? 
  3.    2005లో మోదీ పర్యటనను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది
  4. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): అమెరికా పర్యటన అంశంలో సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొ న్నారు. భారత వ్యతిరేకి అయిన న్యూయార్క్ మేయర్ మమ్దానీతో రేవంత్ భేటీ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం అనుమతి రాకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఆదరబాదరగా అమెరికా పర్యటన చేపట్టారని, కేవలం పరిపాలనా పరమైన కారణాలతోనే విదేశాంగశాఖ రేవంత్ పర్యటనకు అనుమతినివ్వలేదన్నారు. 

అర్హతలేని వ్యక్తులను సీఎం రేవంత్ రెడ్డి కలవాలని నిర్ణయించుకున్నారని, ఆయన పర్యటనపై సీఎం స్పష్టమైన వివరణ ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికి రాజకీయాలు ఆపాదించడం సరికాదని, 2005లో గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు అమెరికా పర్యటనను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. సొంత పార్టీ సీఎంలకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు అన్ని అనుమతులు తీసుకున్నాకే విదేశీ పర్యటన ఖరారు చేసుకుంటారని, ఆదరాబాదరగా లండన్ వెళ్లి.. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లాలనుకున్నారని తెలిపారు. ఆయన విదేశాలకు వెళ్లక ముందే మీ స్థాయికి తగ్గట్టు విదేశీ పర్యటన లేదని, అందుకే అనుమతులు ఇవ్వట్లేదని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పిందన్నారు.

దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుని, అధికారులతో చర్చించి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది, కానీ, రేవంత్ రెడ్డి.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నారని మండిపడ్డారు. విదేశీ పర్యటనల విషయంలో విదేశాంగ శాఖ నిబంధనలు మోదీ ప్రభుత్వం వచ్చాక ఖరారు చేసినవి కాదని, స్వాతంత్య్రం వచ్చినపటినుంచి ఈ నిబంధనలున్నాయని స్పష్టం చేశారు. 

విదేశాంగ విధానాలను బట్టే నిర్ణయాలు..

విదేశాల్లో జరిగే సదస్సులు, సమావేశాలు, భేటీల్లో కలిసే వ్యక్తుల స్థాయి, వారి బ్యాక్ గ్రౌండ్, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారన్నారు. గతంలో తనకు కెనడా వెళ్లేందుకు, రష్యా వెళ్లేందుకు కూడా అనుమతులు రాలేదన్నారు. ఇలాగే అనేక కేంద్రమం త్రులకు విదేశీ పర్యటనల విషయంలో అనుమతులను విదేశాంగశాఖ నిరాకరిస్తుంటుందని, ఇదేదో కొత్త విషయమైనట్టు, రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.

పర్యటనలు దేశ, విదేశాంగ విధానాలను అనుగుణంగా ఉన్నాయా లేదా అని చూస్తారని, పెట్టుబడుల విషయంలో కూడా అన్ని రకాల విషయాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. పాకిస్థాన్ అనుకూల వ్యక్తి, న్యూయార్క్ మేయర్ మమ్దానిని కలవడానికి రేవంత్ ప్రయత్నించారని పత్రికల్లో చదివానని, ఇది వాస్తవమా? కాదా? అని రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. భారత ప్రధానిని టెర్రరిస్టుతో పోల్చిన వ్యక్తి మమ్దానీ.. అలాంటి వ్యక్తిని కలవడానికి రేవంత్ ప్రయత్నించారా? అన్నారు.

వెయ్యి రోజుల్లో ఏం చేశారో చెప్పాలి..

విదేశీ యూనివర్సీటీలను తీసుకొస్తామని చెప్పే రేవంత్ రెడ్డి.. ముందు తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయిస్తామన్నారు. విద్యార్థులకు స్కూటీలు, విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు.. వాటి సంగతేంటి?, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్.. వీటిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేద న్నారు.

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు జిమ్మిక్కులు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయ త్నం చేస్తున్నారని, సెప్టెంబర్ 2 నాటికి రేవంత్ అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతోందని, ఈ వెయ్యి రోజుల్లో తెలంగాణకు ఏం చేశారో.. రేవంత్ చెప్పాలన్నారు. కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, హైదరాబాద్‌లో 20 శాతం ఇళ్లకు కూడా వెళ్లలేదన్నారు. కేంద్రం జనగణనను శాస్త్రీయ పద్ధతిలో జరుపుతోందని, అందులో కుల గణన కూడా జరుగుతోం దన్నారు. ఈ విషంయలో రాహుల్‌కు  లేదని విమర్శించారు. 

నైనీ నుంచి యాదాద్రికి  సరఫరా..

సింగరేణి అభివృద్ధి కోసం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక చర్యలు తీసుకుంటున్నానని, సంస్థ దుబారా ఖర్చులు తగ్గించడం, ఉత్పత్తి పెంచడంతో పాటు బొగ్గు గనులను కేటాయించే విషయంలో చొరవతీసుకుంటున్నానని చెప్పారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రిలోని పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా అయ్యేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కూడా సింగరేణికి ఇచ్చేలా చొరవ చూపాను.

పీకేవోసీ--2 ఓపెన్ కాస్ట్ డిప్‌సైడ్ బ్లాక్ కూడా సింగరేణికి వచ్చేలా చర్యలు తీసుకున్నానని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోయగూడెం బ్లాక్-3 విషయంలోనూ సానుకూలత నెలకొందన్నారు.  సింగరేణి ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని,  దీని నుంచి బయటపడాలంటే బొగ్గు ఉత్పత్తిలో నూతన బ్లాకులు సాధించుకోవడం తప్ప.. వేరే మార్గం లేదన్నారు. సింగరేణికి రూ.55 వేల కోట్ల బకాయిలను రాష్ట్రం త్వరితగతిన ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.

తెలంగాణకు అన్యాయం జరిగినట్లుగా! 

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతులివ్వకపోవడం ఏదో తెలంగాణకు అన్యాయం జరిగిందనేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2005లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ అమెరికాకు వెళ్లకుండా అనుమతులు ఇవ్వలేదని, మరి దీనికి ఎవరిని ప్రశ్నించాలన్నారు. ఈ ఏడాది  జనవరిలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి అనుమతులు ఇచ్చామని, అంతకుముం దు తెలంగాణ మూసీ అభివృద్ధి కోసం లండన్ వెళ్లేందుకు, తాజాగా లండన్ వెళ్లేందుకు కూడా అనుమతులిచ్చామన్నారు.

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అమెరికా పర్యటన విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వకుండా ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇదంతా సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని, ఇదేమీ రాజకీయ అంశం కాదన్నారు. కేంద్రంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, సీఎంలకు విదేశీ పర్యటనలకు అనుమతులిచ్చేటప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు.