26 August, 2026 | 1:49 AM

దేవుడా... ఈ జాప్యమేంటి..?

26-08-2026 12:50 AM

దేవాదాయ పాలకవర్గాల ఏర్పాటుపై చిన్నచూపు

కరీంనగర్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయ పాలకమండళ్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మొత్తం 72 దేవాలయాలు దేవాదాయశాఖ పరిధిలో ఉండగా 33 దేవాలయాలకు నోటిఫికే షన్ జారీ అయి నెలలు గడుస్తున్నాని నియామకాల జాడ లేకుండా పోయింది. ఆశావ హులు రెండేళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పాలకమండలి (ట్రస్టు బోర్డు) ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది. ఇటీవలే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి ఆలయానికి నూతన ట్రస్టు బోర్డును ప్రకటించారు. యాదగిరిగుట్ట, వేములవాడ ఆల యాలకు తిరుమల తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు గత ఏడాది శాసన సభలో చట్టసవరణ కూడా చేశారు.

ప్రతిపాదన మేరకు పాలకమండలి ఏర్పడుతుందని ఆశతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయం, పురాతనమైన గౌరీశంకర ఆలయం, దసరా ఉత్సవాలకు ప్రసిద్ధిచెందిన గిద్దెపెరుమాండ్ల స్వామి దేవస్థానంతోపాటు మొత్తంగా 20కిపైగా దేవాలయాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కానీ నియామకాలు మాత్రం లేకుండా పోయాయి.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పరిధిలో కోటి రూపాయలకుపైగా ఆదాయం వచ్చే ఆలయాలు ఆరు ఉండగా, 25 లక్షల నుంచి కోటి రూపాయల ఆదా యం వచ్చే ఆలయాలు ధార్మిక పరిషత్ కింద ఉన్నాయి. 2 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు దేవాదాయశాఖ కమిషనర్ పరిధిలో 46 ఉన్నాయి. 2 లక్షలలోపు ఆదాయం వచ్చే డిప్యూటి కమిషనర్ పరిధిలో 8 ఆలయాలు ఉన్నాయి.

జగిత్యాల జిల్లా విషయానికి వస్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం, అలాగే ధర్మపురి లక్ష్మీనర సింహస్వామి దేవాలయాలకు సంబంధించి తాజా గా నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యా యి. అలాగే జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ లోని గండి హనుమాన్ ఆలయ పాలకవర్గానికి సంబంధించి ఇన్స్పెక్టర్ రిపోర్టు పెండింగ్లో ఉండగా, గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లిఖార్జున స్వామి ఆలయం నోటిఫికేషన్ జారీ అయి ఉంది.

అలాగే జగిత్యాలలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం, రాయికల్ ఆంజనే యస్వామి దేవస్థానానికి సంబంధించి నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎల్దండి మల్లిఖార్జున స్వామి దేవస్థానం, ధర్మపురి అక్కపల్లి రాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మంథని మహాలక్ష్మీ దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాల నోటిఫికేషన్ విచారణ పెండింగ్లో ఉండగా, జూలపల్లి మండలం పెద్దూరు యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నోటిఫికేషన్ విడుదలయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, శివసాయిబాబా దేవాలయం, పోచమ్మ దేవాలయం, విశ్వనాథ స్వామి దేవాలయాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ అయి ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ అయిన 8 దేవస్థానాల కమిటీల పోలీస్ విచారణ పూర్తయి నా నియామకాల్లో జాప్యం జరుగుతుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృ ప్తిని లోనవుతున్నారు. దసరా పర్వదినం నాటికైనా కమిటీలు పూర్తి చేయాలని కోరుతున్నారు.