26 August, 2026 | 2:08 AM

విస్తరణకు వేళాయె!

26-08-2026 01:20 AM
  1. త్వరలోనే రెండు బెర్తులు భర్తీ 
  2. క్యాబినెట్‌లోకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి 
  3. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు చోటు!
  4.  స్పీకర్ పదవి సీనియర్ మంత్రికి..! 
  5. కొందరు మంత్రుల శాఖల్లోనూ మార్పు 
  6. పార్టీకి మంత్రి కోమటిరెడ్డి సేవలు..! 
  7. మంత్రి కొండా సురేఖపై వేటుపడితే.. బీసీ సామాజికవర్గానికే చోటు

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు .. కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకుల మధ్య నెలకొన్న వివాదాలు, పంచాయితీలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు 18 మంది మంత్రులు ఉండాలి. అయితే ప్రస్తుతం క్యాబినెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, 15 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా రెండు బెర్తులను భర్తీచేయాల్సి ఉంది. ఇప్పుడు మంత్రి కొండా సురే ఖ వివాదం నడుస్తున్నది. పార్టీ అధిష్ఠానం కూడా  మంత్రి సురేఖపై సీరియస్‌గా ఉన్నదని.. ఒకవేళ ఆమెపై వేటుపడితే.. మూడు బెర్తులు ఖాళీ అవుతాయి. కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గం నుంచి మంత్రిగా ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

ఖాళీగా ఈ రెండు మంత్రి పదవులను దాదా పు అరడజన్‌కు పైగా ఎమ్మెల్యేలు ఆశిస్తున్నా రు. రెండు బెర్తుల్లో ఒకటి మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. స్పీకర్ పదవికి ఒక సీనియర్ మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక కొందరు  మంత్రుల శాఖలపై పార్టీ అధిష్ఠానం నివేదికలు తెప్పించుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.

పని ఒత్తిడి ఎక్కువగా ఉండే శాఖలు, పనితీరు సరిగా లేనివారి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలున్నాయి. వీటి లో కొన్నింటిని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు కేటాయించి.. ఒత్తిడిని తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రభుత్వవర్గాలు చెబుతు న్నాయి. ఇక ఒకరిద్దరి మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.  

తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలకుగాను రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ రెండు జిల్లాల నుంచి క్యాబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీ నుంచి కాంగ్రె స్‌లో చేరేముందు పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చిందని చర్చ జరుగుతున్నది.

ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలున్న విషయం తెలిసిందే. ఇప్పుడు  ఉమ్మడి నల్లగొండ నుంచి మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే పార్టీ, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం కాంగ్రెస్ ను వెంటాడుతోంది.

అందుకు రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ నాన్చుకుంటూ వస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సేవలను పార్టీకి వినియోగించుకుని, మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని తీసుకోవాలనే ఆలోచనకు కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్‌లో రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉందని, మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వడం కుదరనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చినట్లుగా తెలుస్తోంది.

అందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా గాంధీభవన్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్‌కుమార్‌కు మంత్రి వర్గంలోకి తీసుకుంటే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని చెబుతున్నారు.

ఇక స్పీకర్ పదవిని ఒక సీనియర్ మంత్రికి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కని నిజాబాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించిన విషయం తెలిసిందే. 

డిప్యూటీ స్పీకర్, చీప్ విప్ పదవులు కూడా భర్తీ .. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో చీఫ్ విప్ పదవిని భర్తీ చేయలేదు. ఇటీవల విప్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక  డిప్యూటీ స్పీకర్‌గా మహబూబాబాద్ ఎమ్మెల్యే రాంచంద్రనాయక్‌ను పేరు ఖరారు చేసినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బాధ్యతలు చేపట్టలేదు.

ఈ అసెంబ్లీ సమావేశాల లోపే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు వినిపిస్తోంది. ఇక చీఫ్ పదవీ ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పేరు వినిపిస్తోంది. 

ఆది శ్రీనివాస్ పేరు తెరపైకి..

వేములవాడ: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్న వేళ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆయనకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్‌కు క్యాబినెట్‌లో చోటు కల్పిస్తే ఉత్తర తెలంగాణలో పార్టీకి రాజకీయంగా మరింత ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉంది.

ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటుండటం ఆయనకు అనుకూల అంశాలుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా ఆయన పేరును పరిశీలనలోకి తెస్తున్న అంశాల్లో ఒకటి. మంత్రివర్గంలో మార్పు లు జరిగితే ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. ఆది శ్రీనివాస్ పేరు చర్చలో ఉండటం వేములవాడ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.