గ్రూప్1 పరీక్షపై అప్పీళ్లు కొట్టివేత
జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఆదివారం జరగనున్న గ్రూపు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇప్పుడు పరీక్షలను వాయిదా వేయలేమని ప్రకటించింది. వేరే పరీక్షలు రాస్తున్న కొద్దిమంది కోసం ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. పరీక్ష వాయిదాకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్ ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం గణేష్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సింగిల్ జడ్జి కొట్టివేశారు. ఆ తీర్పును సవాలు చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతున్నందున ఒక పరీక్షకు అభ్యర్థులు హాజరుకాలేపోతున్నారని, ప్రిలిమ్స్ వాయిదా వేస్తే అభ్యర్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ వాదనను టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. గ్రూప్ ప్రిలిమ్స్‌కు 4.30 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని, వచ్చే ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. వాదనల తర్వాత అప్పీలును కొట్టిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని వెల్లడించింది.






