3 September, 2026 | 3:08 AM

వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చీటింగ్

03-09-2026 | 01:22am
  1. ఇది 420 ప్రభుత్వం! 
  2. ఆరు గ్యారెంటీలతో మోసం.. 
  3.    420 హామీలతో గొంతు కోత 
  4. ఒక్క హామీకి పూర్తి న్యాయంచేయని రేవంత్ సర్కార్ 
  5. ఎన్ని హామీలు పూర్తి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి 
  6. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ(Telangan)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయ్యాయని.. ప్రతి విషయంలోనూ 420 ప్రభుత్వం చీటింగ్ చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. ఈ వెయ్యి రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించుకుంటే.. రేవంత్ ప్రభుత్వం(Revanth government) ఆడుతున్న అబద్ధాలు, అనవసర ఆర్భాటాలు, ఆరు గ్యారంటీలు(six guarantees), 420 సబ్ గ్యారంటీల అమలులో మోసం, రోజుకో కొత్త సాకు వెతుక్కోవడం మాత్రమే కనిపించిందని తెలిపారు.

ఎన్నికల ముందు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాంధీ(Rahul Gandhi), ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) తెలంగాణకు వచ్చి హామీల వర్షం కురిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. ఈ వెయ్యి రోజుల్లో ఎన్ని హామీలు పూర్తి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ ఒకే రకమైన ఆలోచనతో 12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసంచేస్తూనే ఉన్నారని విమర్శించారు.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై కిషన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రోడ్డెక్కడం అత్యంత బాధా కర మైన విషయమని, సర్కారు తమను చీటింగ్ చేసింది కాబట్టే.. వాళ్లు నిరసన తెలపాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

ఏకంగా 6 డీఏలను పెండింగ్‌లో పెట్టి.. వారిని నిట్టనిలువునా మోసం చేస్తోందని, పూర్తి స్థాయిలో.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు చేయకపోగా.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కోత విధిస్తోందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనెఫిట్స్ విషయంలోనూ.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని, ఉద్యోగులను చీటింగ్ చేసిన సర్కారుగా చరిత్రలో కాంగ్రెస్ నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.

మహిళలు, వృద్ధులకు చీటింగ్..

ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, వెయ్యి రోజులు పూర్తయినా ఆ హామీ ఏమైం దో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. ఒక్కో మహిళకు రూ. 80 వేలకు పైగా బాకీ పడిన చీటింగ్ సర్కార్‌గా చరిత్రలో నిలిచిపోతుంద ని, కాలేజీకి వెళ్లే ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూ టీలు ఇస్తామని మోసంచేశారన్నారు.

వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వే లు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని తెలిపారు. యువతకు ఏడాదికి 2 లక్షల ఉ ద్యోగాలు, జాబ్ క్యాలెండర్, రూ.4వేలు నిరుద్యోగ భృతి అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముం దు ఊదరగొట్టి.. వెయ్యి రోజుల్లో ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు? ఏటా 2 లక్షల ఉ ద్యోగాల హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.  

రైతులు, విద్యార్థులకు చీటింగ్!

పేద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోవడం చీటింగ్ కాదా?,  ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు. దీనికితోడు.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.14వేల కోట్లకు పేరుకుపోయినా.. పట్టించుకోకుండా సర్కార్ చీటింగ్ చేస్తున్నదని విమర్శించారు.  రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి, కిస్తీలు ఎగ్గొట్టి, గుర్తొచ్చినప్పుడల్లా కొంత డబ్బు విడుదల చేసి రైతులకు ఏదో గొప్ప ఉపకారం చేసినట్లు ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 పంటలకు  బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వరికే అన్నారని, ఇప్పు డు సన్నబియ్యానికే అని చెప్పినా.. అది కూ డా ఇవ్వకుండా నిట్టనిలువునా రైతులను ముంచేశారన్నారు. భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి రూ.15వేలు ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పారని, దీనికి సంబంధించిన పెండింగ్ బకాయిలే దాదా పు రూ. 57వేల కోట్లున్నాయని, వీటిని ఇవ్వకుండా రైతులను చీటింగ్ చేస్తున్నారన్నారు.

భూముల విషయంలోనూ చీటింగ్!

ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి...ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను తమ భూములపైనే హక్కులేకుండా చేశారన్నారు. కొత్త సమస్యలు సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టడం.. చీటింగ్ కాదా? అని ప్రశ్నించారు. వెయ్యి రోజుల్లో ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి పింఛన్లు ఇచ్చారు? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. అమరవీరులను చీటింగ్ చేయడం నిజం కాదా? అని నిలదీశారు. 

బీసీ సమాజానికి చీటింగ్!..

బీసీ సంక్షేమం కోసం మూడేళ్లకు సంబంధించిన రూ.60 వేల కోట్లు ఏమయ్యాయి? ఇప్పటివరకు కనీసం రూ.10 వేల కోట్లు కూడా కేటాయించలేదన్నారు. ఇది బీసీలను చీటింగ్ చేయడం కాదా? అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ యువతకు వ్యాపారం చేసుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. తెలంగాణలో కుల గణన పేరుతో నానా హంగామా చేసి.. ముస్లింలను వర్గాలను బీసీల్లో చేర్చి.. బీసీలను నిట్ట నిలువునా మోసం చేశారని విమర్శించారు. 

ప్రతి వర్గానికి చీటింగ్!

‘విద్యాజ్యోతులు’ పథకంతో పదో తరగతి పూర్తిచేసుకున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు, ఇంటర్  పూర్తి చేసుకున్న వారికి రూ.15 వేలు, డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి రూ.25 వేలు, పీజీ పూర్తి  చేసుకున్న వారికి రూ.లక్ష, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి.. వారిని కూడా చీట్ చేశారన్నారు. ప్రతి మండలానికి ఎస్సీ, ఎస్టీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడంలేదని తెలిపారు.

ఈ వెయ్యి రోజుల్లో.. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ప్రచారాలు, ప్రకటనలు, సాకులు పక్కనపెట్టి వెయ్యి రోజుల్లో ఎన్ని హామీలు పూర్తిగా అమలు చేశారో, ఎన్ని హామీలు పెండింగ్‌లో ఉన్నాయో, ఎన్ని హామీలను వదిలేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిన 420 ప్రభుత్వమని విమర్శించారు.

హామీలను నెరవేర్చకుండానే.. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయడంలో నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ఒకేలా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వెయ్యి రోజులు పూర్తయ్యాయని.. తెలంగాణ ప్రజలు మిగిలిన 825 రోజుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలనే స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని ఆయన తెలిపారు.