3 September, 2026 | 3:36 AM

జలభద్రతకు ఏకీకృత ప్రణాళిక

03-09-2026 | 02:45am
  1. జల సంరక్షణ పనులన్నీ ఒకే గొడుగు కిందికి
  2. ప్రతి జల ఆస్తికి ఐడీ 
  3. నిర్వహణ బాధ్యతలు నిర్దిష్ట సంస్థకు 
  4. జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం సహకరించాలి
  5. ‘జల్ సంచయ్- భాగీదారీ’ సదస్సులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  6. ఏఐ ఆధారిత జల నిర్వహణకు చేయూతనివ్వాలి విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జలభద్రతా ప్రణాళి క పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) కేంద్రాన్ని కోరారు. ప్రతి జల సంరక్షణ ఆస్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని నిర్వహణ బాధ్యతను నిర్దిష్ట సంస్థకు అప్పగించాలని సూచించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన తొలి శాఖాపరమైన ‘జల్ సంచయ్-- భాగీదారీ’ సదస్సులో ఉత్తమ్ ప్రసంగించారు.

జలభద్రతను కేవలం ఇంజినీరింగ్ లేదా ప్రభుత్వశాఖల కార్యక్రమంగా కాకుండా తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధులు, పట్టణ భద్రత, పర్యావరణ పరిరక్షణ తో ముడిపడిన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్నా రు. దేశవ్యాప్తంగా ఉపాధిహామీ, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ఆర్థిక సంఘం నిధులు, కాంపా, వాటర్‌షెడ్ కార్యక్రమాలు, రాష్ట్ర పథకాలు, స్థానిక సంస్థలు, సీఎస్‌ఆర్ నిధులతో జల సంరక్ష ణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

వీటి మధ్య సమన్వయం లేకపోతే పనుల పునరావృతం, అనువుకాని ప్రాంతాల ఎంపిక, నిర్వహణ లోపాలు తలెత్తుతాయని హెచ్చరించారు. అందుకే ప్రతి గ్రామం, పట్టణానికి ప్రత్యేక జలభద్రతా ప్రణాళిక రూపొందించి, వాటిని రాష్ట్రస్థాయి ఏకీకృత జల ఆస్తుల రిజిస్టర్, ఉమ్మడి పనితీరు కొలమానాలతో అనుసంధానించాలని కోరారు.  

22,428 చెరువుల పునరుద్ధరణ

తెలంగాణలో 44,360 చెరువులు, ఇతర జలవనరులు ఉండగా 28,739 చోట్ల పనులు చేపట్టి, 22,428 జలవనరుల పునరుద్ధరణ పూర్తి చేసినట్లు ఉత్తమ్‌చెప్పారు. రాష్ర్టంలోని 74 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 74.51 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం సృష్టించగా, మరో 53.18 లక్షల ఎకరాల సామర్థ్యాన్ని  సాగులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. 2026-- ప్రణాళికలో 17.28 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడం లేదా ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు రూ.46,110.35 కోట్ల వ్యయం అంచనా వేసినట్టు వివరించారు.

చెరువుల గొలుసుకట్టు వ్యవస్థను ఫీడర్, మిగులు నీటి కాలువలతో సహా సమగ్రంగా పునరుద్ధరించాలని మంత్రి కోరారు. ఆక్రమణలు, అడ్డంకులు తొలగించి ఎఫ్‌టీఎల్ పరిధిని పరిరక్షించడంతోపాటు అధికారిక రికార్డులను నవీకరించాలని కోరారు. భూగర్భజల అధిక వినియోగ ప్రాంతాలు, కరవు ప్రభావిత ప్రాంతాలు, తాగునీటి కొరత ఉన్న గ్రామాలకు జల సంరక్షణలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పనులు ప్రారంభానికి ముందు ప్రాథమిక పరిస్థితులను నమోదు చేసి, వర్షాకాలం అనంతరం ఫలితాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు.

పూడికతీతతో సామర్థ్యం పునరుద్ధరణ

తెలంగాణలోని 159 భారీ, మధ్యతరహా జలాశయాల నిల్వ సామర్థ్యం సుమారు 929 టీఎంసీలు కాగా, 18 ప్రాజెక్టుల్లో పరిశీలించిన 222.90 టీఎంసీల సామర్థ్యంలో 40.97 టీఎంసీలు, అంటే 22.95 శాతం పూడిక కారణంగా కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. దిగువ, మధ్య మానేరు, కడెం జలాశయాల్లో ఆదాయ ఆధారిత ప్రయోగాత్మక పూడికతీతను ప్రారంభించామని, 9.51 లక్షల టన్నుల పూడిక తొలగించి 3.74 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం లక్ష్యమని చెప్పారు.

ఫలితాలను బట్టి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, నాగార్జునసాగర్, మూసీ, పోచారం జలాశయాల్లోనూ ఈ విధానాన్ని పరిశీలించవచ్చన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద అర్హత ఉన్న తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందించాలని విజ్ఞప్తిచేశారు.

సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను నిర్దిష్ట కాలపరిమితిలో మంజూరు చేయాలని, అంతర్రాష్ట్ర జల పంపిణీ అంశాలను సకాలంలో పరిష్కరించాలని, జలాశయాల సామర్థ్య అధ్యయనాలు, పునరుద్ధరణకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలని కోరారు. వర్షపాతం, నదీ ప్రవాహాల అంచనా, జలాశయాల నిర్వహణ, ఆధారపూర్వక నిర్ణయాల కోసం కత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.