3 September, 2026 | 2:43 AM

మీది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన

03-09-2026 | 01:45am

సీఎం రేవంత్ రెడ్డి భాషలో.. ఈ వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన క్రిమినల్ వేస్ట్

  1. ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన 
  2. జలద్రోహం చేస్తున్న జలగల పాలన 
  3. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ లేదు.. ఉన్నది లుచ్ఛా కాంగ్రెసే 
  4. సంపాదన కోసం మంత్రులు, సీఎం తన్నుకున్నారు 
  5. వెయ్యి రోజుల్లో వెయ్యికిపైగా అన్నదాతల ఆత్మహత్యలు 
  6. సీఎంగా కేసీఆర్ తిరిగి అసెంబ్లీకి వస్తారు.. 
  7. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీ సమావేశాల్లో ఉతికి ఆరేస్తాం 
  8. వెయ్యి రోజుల సీఎం రేవంత్ పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జిషీట్ విడుదల 
  9. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారే కాదు. తెలంగాణ ముమ్మాటికి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) వల్లనే సాధ్యమైంది. ఆయనను రాజీనామా చేయాలనే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ రాజీనామా(KCR resignation) చేస్తే ఏం జరుగుతుందో సోనియా గాంధీకి తెలుసు.  గతంలో కేసీఆర్ రాజీనామా చేయడం వల్లనే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం గడగడలాడింది. కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి లాంటి అర్బకుడు తట్టుకునే పరిస్థితి ఉండదు. 

* చంద్రబాబు(Chandrababu) చెంచా ఈ ముఖ్యమంత్రి. సాగునీటి రంగం(Irrigation Sector)లో మాకు సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు. ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యూసీ మెంబర్. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఐఏఎస్ అధికారి మీ సలహాదారు. తెలంగాణ బద్ద వ్యతిరేకి ఆదిత్యనాద్ దాస్ మీ సలహాదారా?. జలద్రోహం చేస్తే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. గోదావరి, కృష్ణలో ఒక్క నీటి బొట్టు ద్రోహం జరిగినా వదలం.                          

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి వెయ్యి రోజులైంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి పీడదినాలు మొదల య్యాయి. ప్రజాపాలన(people governance) అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు చూపిస్తున్నారు. రాష్ట్రంలో శిఖండి పాలన నడు స్తోంది. వంద రోజుల గ్యారంటీల(guarantees)కు మంగళం పాడారు. వెయ్యి రోజులు ప్రజలను నిలువెత్తున ముంచారు.

వెయ్యి రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన, తెలంగాణ(Telangana)కు పట్టిన శనికి వెయ్యిదినాలు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Taraka Rama Rao) (KTR) విమర్శించారు. ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదనను కొల్లగొట్టే విషయంలో మంత్రులు, ముఖ్యమంత్రి(ministers, Chief Minister) తన్నుకున్నారని.. ‘జెన్ జీ(Gen Z)కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ‘అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్..’ ఆ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్(KTR) మండిపడ్డారు.

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెయ్యి రోజుల పాలనపై బుధవారం మాజీమంత్రి హరీశ్ రావు(Harish Rao)తో కలిసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఛార్జ్జిషీట్‌ను విడుదల చేశారు. వెయ్యి రోజుల పాలన సందర్భంగా ఏమైనా చెప్పుకుంటారేమో అని చూశామని, కానీ ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన ఇదని, తమ స్వతంత్రాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన సామంతుల పాలన అని, ఢిల్లీ ముందు మోకరిల్లిన సన్నాసుల పాలన అని, జలద్రోహం చేస్తున్న జలగల పాలన అని కేటీర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే.. ఈ వెయ్యిరోజులు ఒక క్రిమినల్ వేస్ట్ అన్నారు. 

బుసకొడుతున్న పాలన..

‘అన్నిరంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఇది. వంద రోజుల్లోనే స్వర్గం చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపారు. అబద్ధం, అరాచకం, అజ్ఞానం, అవినీతి అనే నాలుగు పడగలతో బుస కొడుతున్న అనుముల నాగుపాము పాలన ఇది. రైతన్నలను రాచి రంపాన పెడుతున్న రాక్షస పాలన. నిరుద్యోగులను నిండా ముంచిన నికృష్ణ పాలన ఇది. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలన్నారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నారు.

నిన్న సెక్రటేరియట్ వద్ద వేల మంది ఉద్యోగులు బయటికొచ్చి ఆందోళన చేశారు. ఇస్తవా.. చస్తవా.. అని సీఎంను బెదిరించే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ విఫల పాలనకు ఇంతకుమించిన నిదర్శనం ఏముంటుంది?. ఉద్యోగులకు ఉత్త చేతులు చూపారు.. దళితులను దగా చేశారు. బహుజనులను మోసం చేసిన బడుద్ధాయిల పాలన ఇది. మైనారిటీలకు ధోకా మాత్రమే మిగిలింది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

కొల్లగొట్టిన భూములు..

‘బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూలుస్తున్నారు. అనుముల అనుయాయులు, మంత్రి పొంగులేటి అనుచరులు రాష్ట్రంలో భూములు కొల్లగొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లే సెటిల్‌మెంట్ల అడ్డాగా మారిపోయింది. పారిశ్రామిక వేత్తలను పిలిచి వారి నెత్తిన తుపాకీ పెట్టి బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి ఉంది. 22-ఏ పేరిట కోట్లాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. 30 శాతం కమీషన్లు ఇస్తేనే ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని అంటున్నారు.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లాంటి మంత్రులే స్వయంగా 30 వేల కోట్ల రూపాయల నైనీ టెండర్ల కుంభకోణాన్ని ఆపాలని చెప్తున్నారు. అనుముల బ్రదర్స్ అనకొండ బ్రదర్స్‌గా మారిపోయారు. రేవంత్ అనుచరులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు కుంభకోణాలు చేస్తున్నారు’ అని ఈ సందర్భంగా వెయ్యి రోజుల్లో జరిగిన ముప్పు స్కాములు జరిగాయని, వాటిని ఆయన చదివి వినిపించారు. ‘ఆనాడు రేవంత్ గురువు తెలంగాణను నిషేధించాడు.

ఈయనేమో తెలంగాణ కోటి ఎకరాల మాగాణను నిషేధించాడు. ఒక్కో ఎకరానికి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. కమీషన్లు, పర్సంటేజీల అవినీతి అరాచక పాలన ఇది. వెయ్యి రోజుల్లో సంపాదించుకున్న అక్రమ సంపాదన విషయంలో విభేదాల వల్లనే ఈ రోజు మంత్రులు, మంత్రుల కుటుంబసభ్యులు బయటకు వచ్చి బహిరంగంగా తన్నుకుంటున్నారు.

30 శాతం కమీషన్ లేకపోతే ఒక్క పని చేయని వెయ్యి రోజుల పాలనలో కుంభకోణాల్లో వాటాల కోసమే పబ్లిక్‌గా కొట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు ఎంత బాహాటంగా దోపిడీ చేస్తున్నారో మంత్రి కొండా సురేఖ కూతురే బహిరంగంగా చెప్పింది. వారిపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు’ అని విమర్శించారు. 

వెయ్యి రోజులు.. నాలుగున్నర లక్షల కోట్లు..

‘వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు. ఒక ఇటుక పెట్టలేదు, ఒక చెరువు కట్టలేదు, ఒక చెక్ డ్యాం కట్టలేదు. కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కటింగులు తప్ప వీళ్లు చేసిందేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి. లాఠీలు, లూటీలు, నేరాలు, ఘోరాలు, వెకిలి మాటలు, మకిలి చేతలు. ఢిల్లీకి మూటలు.. మంత్రివర్గంలో తన్నులు, కీచులాటలు’ అని పేర్కొన్నారు. 

రైతు కుటుంబాలు ఆగం..

‘రైతులకు ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు?. 70 లక్షల రైతు కుటుంబాలను ఆగం చేశారు. రూ.50 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు. 15 రోజులు తిరిగే సరికి రూ.41 వేల కోట్లకు తగ్గింది. క్యాబినెట్‌కు వచ్చే సరికి రూ.31 వేల కోట్లకు కుదించారు. బడ్జెట్ కాడికి వచ్చేసరికి రూ.26 వేల కోట్లకు కట్  చేశారు. అమలు దగ్గరికి వచ్చేసరికి రూ.20 వేల కోట్లే అయ్యింది. రూ.50 వేల కోట్లు ఎక్కడ?, రూ.20 వేల కోట్లు ఎక్కడ?. రూ.20 వేల కోట్లతోనే రుణమాఫీ ముగించారు.

మిత్తిగట్టిన రైతులకు కూడా టోపీ పెట్టారు. కేసీఆర్ చెప్పినట్టే.. మళ్లీ యూరియా కోసం చెప్పుల లైన్లు వచ్చాయి. లగచర్లలో హీర్యానాయక్ అనే రైతును సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు. రైతన్నలు గుండె పగిలి వరిధాన్యాల కుప్పల మీదనే చనిపోయారు. తడిసిన ధాన్యంతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

భారతదేశంలోనే అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ మనది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ నాయకత్వంలో ఎదిగింది. తేరుకున్న వ్యవసాయాన్ని మళ్లీ తెర్లుతెర్లు చేశారు. కాలర్ ఎగరేసుకుని బతికిన రైతన్నను మళ్లీ కాళ్లు మొక్కించే దుస్థితికి తెచ్చారు. అయ్యా యూరియా ఇయ్యండని అధికారుల కాళ్లు మొక్కే ఖర్మ పట్టింది’ అని కేటీఆర్ మండిపడ్డారు.

నీళ్లు పోతున్నా.. సోయి రాలేదు..

‘నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నా సోయి రాలేదు. గోదావరి, కృష్ణా నీళ్లను కిందికి వదిలారు. నీళ్లు అడిగితే రక్తం జల్లండని చెప్పిన రక్తపిశాచి రేవంత్. నీరు పారాల్సిన చోట నెత్తురు పారించే వాడు. నేరగాడా? ముఖ్యమంత్రా?. ఒక్క యూరియా బస్తా కోసం నరకం. కొనుగోలు కేంద్రాల్లో నెలలపాటు పడిగాపులు. రైతులు తమ బాధ చెప్తుంటే చలించిపోయినం.

వెయ్యి రోజుల్లో వెయ్యి పైచిలుకు అన్నదాతల ఆత్మహత్యలు. ఇదే కాంగ్రెసోళ్లు సాధించిన అతిపెద్ద విజయం. బోనస్ అని బోగస్ చేశారు. కానీ కేసీఆర్ పాలనలో రైతుబీమా అందించినం. రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇచ్చి ధీమా అందించినం. ఇవాళ ధీమా లేదు.. బీమా లేదు. రైతుబీమాను చిదిమేసింది కాంగ్రెస్ ప్రభుత్వమ’ని విమర్శించారు. 

రైతు బంద్ పోయి రాహుల్ బంధు..

‘రైతుబంధు ఎగవేత, రుణమాఫీ సగానికి సగం కోత. రైతుబీమా రద్దు.. బోనస్ పచ్చి బోగస్. రైతుబంధు బంద్ అయింది.. రాహుల్ బందు చాల్ అయింది. టకీటకీమని రైతులకు రైతుబంధు పడుతలేదు. కానీ ఢిల్లీకి మాత్రం మూటలు బ్రహ్మాండంగా పోతున్నాయి. అన్నదాత జేబులు కొట్టి.. రాహుల్ గాంధీ జేబులు నింపుతున్నడు.

తన తల తెగిపడినా మోటర్లకు మీటర్లు పెట్టనివ్వనని కేసీఆర్ తేల్చిచెప్పారు. రూ.30 వేల కోట్లు ఇవ్వకున్నా మీటర్లు మాత్రం పెట్టనివ్వలేదు. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టడానికే రైతు డిస్కం పేరిట కుట్ర. రైతును శాశ్వతంగా చిదిమేసే ప్రయత్నం జరుగుతోంది’ అని చెప్పారు.

సీఎంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు..

‘నీకు బేసిన్లు తెల్వదు, ట్రిబ్యున్నళ్లు తెల్వదు, సబ్జెక్టు లేదు. బూతులు తప్ప తెలుగు కూడా సక్కగ రాదు. ఈపాటి అందానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ అంటున్నడు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారే కాదు. తెలంగాణ ముమ్మాటికి కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. సింగపూర్‌కు చెందిన లీ కువాన్ యూ మాదిరిగానే కేసీఆర్‌ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు గౌరవించుకోవాల్సిన అవసరముంది. అంతటి స్థాయి కలిగిన వ్యక్తి రాజీనామా చేయాలనే అర్హత రేవంత్ రెడ్డికి లేదు.

కేసీఆర్ రాజీనామా చేస్తే ఏం జరుగుతుందో సోనియా గాంధీకి తెలుసు.  గతంలో రాజీనా చేసిన కేసీఆర్ వల్లనే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం గడగడలాడింది. కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి లాంటి అర్బకుడు తట్టుకునే పరిస్థితి ఉండదు. ఈ మాటలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలా?, ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి తిరిగి వస్తారు. తిరిగి సీఎంగా అసెంబ్లీకి వస్తారు. రేవంత్‌కు తెలిసింది చెంచాగిరీ ఒక్కటే. చంద్రబాబుకు చెంచాగిరీ చేయడంలో నంబర్ వన్.

గురువు గురుదక్షిణ కోసం గోదావరి, కృష్ణా నీళ్ల సంతర్పణ. బనకచర్ల పేరిట మన నీళ్లు దోపిడీ. ఏడు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని..జీఆర్‌ఎంబీలో ఎజెండా పెట్టారు. కనీసం నిలదీయలేని చంద్రబాబు చెంచా ఈ ముఖ్యమంత్రి. సాగునీటి రంగంలో మాకు సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు.

ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యూసీ మెంబర్. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఐఏఎస్ అధికారి మీ సలహాదారు. తెలంగాణ బద్ద వ్యతిరేకి ఆదిత్యనాద్ దాస్ మీ సలహాదారా?. జలద్రోహం చేస్తే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. జలసౌధను ముట్టడిస్తామని మేం వార్నింగ్ ఇస్తే జీఆర్‌ఎంబీ మీటింగ్ వాయిదా వేశారు. గోదావరి, కృష్ణలో ఒక్క నీటి బొట్టు ద్రోహం జరిగినా వదలం’ అని హెచ్చరించారు.

జెన్‌జీలతో రాహుల్ ఫోజులు..

‘జెన్‌జీలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో పోజులు కొడుతున్నడు. రాహుల్ గాంధీని పట్టుకొచ్చి నిరుద్యోగులకు అబద్ధాలు చెప్పించారు. నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులను నయవంచన చేశారు. మరి ఇక్కడ నీ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నడో గమనించావా?. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగాలని, బాయిలో దూకాలని అంటున్నడు. నోటిఫికేషన్లు అడిగితే తలకుమాసినోళ్లు అని బూతులు తిట్టాడు. జాబ్ క్యాలెండర్ అడిగితే లాఠీలతో రక్తాలు కారేట్టు కొట్టించాడు.

అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్ సుఖ్ నగర్‌లో నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేశాడు. జాబులు నింపమని అడిగితే.. జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీలో జాబ్ లెస్ క్యాలెండర్ చేతిలో పెట్టారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఉతికి ఆరేస్తాం. 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏమైందని అసెంబ్లీలో నిలదీస్తం.

రూ.4 వేల నిరుద్యోగ భృతి ఏమైంది?. దండాలు పెట్టి ఓట్లు వేయించిన నిరుద్యోగులే మీకు పిండాలు పెడతరు. ముఖ్యమంత్రికి చదువు రాదు, సంస్కారం లేదు. వెయ్యి రోజుల్లో వెయ్యి గురుకులాలను నాశనం చేశారు. విషాహారం పెట్టి లేత పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. 150 మంది గురుకుల విద్యార్థుల ఉసురు తీశారు. 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించే కుట్ర’ జరుగుతుందని విమర్శించారు.

నువ్వు కాగితంపై సక్కగా రాస్తే రాజీనామా చేస్తాం..

‘జెన్ జీతో పెట్టుకుంటే మోదీకే ముచ్చెమటలు పట్టినయి. నీలాంటి కేడీకి ఈజీగా భరతం పడతరు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఒక్కరికైనా అందిందా?, లూటీలు తప్ప స్కూటీలు లేవు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటున్నడు. వారికి అప్లికేషన్లు రాయరాదని వాగుతున్నడు. నువ్వు ఒక్క తెల్ల కాగితం మీద పొల్లుపోకుండా ఒక్క అక్షరం రాయి చూద్దాం. నీకు ఇష్టమున్న భాషలో రాయి.. సక్కగ రాస్తే మేం రాజీనామా చేస్తం.

కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నరు. కల్యాణలక్ష్మి మీద కేసు వేయించిందే కాంగ్రెస్ పార్టీ. కౌంటర్ వేయకుండా జాప్యం చేసిందే ప్రభుత్వం. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయండి చాలు. నెలకు రూ.2500 ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నరు. ఒక్కో ఆడబిడ్డకు రూ.80 వేలు బాకీ పడ్డారు. 1.67 కోట్ల మంది ఆడబిడ్డల ఖాతాలో డబ్బులు వేయ్. జీతం పెంచమని అడిగితే అంగన్ వాడీలపై దాడులు. రెండు నెలల పాటు రూ.2 వేల పెన్షన్ ఎగ్గొట్టారు.

రూ.4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తారని లబ్ధ్దిదారులు ఎదురుచూస్తున్నరు. పథకాలకు డబ్బుల్లేవు అంటున్నాడు. బోధి ప్యాలెస్‌లో కూర్చున్న కబోదికి అభాగ్యుల ఆర్తనాదాలు వినబడవా?. మూడున్నర లక్షల పాత పెన్షన్లు కోత పెట్టారు. 51 శాతం ఉన్న బీసీలను 5 శాతం మేర కుదించారు. కామారెడ్డి డిక్లరేషన్ కాకెత్తుకుపోయింది. లక్ష కోట్లు అని లక్ష పోట్లు పొడిచిండు.

బీసీ కార్పొరేషన్‌కు ఇచ్చింది రూ.74 కోట్లు మాత్రమే. ఎంబీసీ కార్పొరేషన్‌కు ఇచ్చింది రూ.99 లక్షలు మాత్రమే. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌పై గొంతు విప్పుతాము. ఇప్పటికే వెయ్యి రోజుల పాలనపై వారం రోజుల ప్రణాళికను ప్రకటించాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, భవిష్యత్తులోనూ విస్తృతమైన కార్యాచరణతో ముందుకు పోతాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

5% ఖర్చు పెట్టినా కాఫర్ డ్యాం కట్టేవారు..

‘కాళేశ్వరం మీద కక్ష, రైతన్నకు శిక్ష. నీళ్లున్నా ఎత్తిపోయడం లేదు. రూ.200 కోట్లు మిస్ వరల్డ్ పోటీలకు పెట్టారు. మెస్సీ ఫుట్‌బాల్ ఆటకు రూ.100 కోట్లు పెట్టారు. అందులో 5 శాతం ఖర్చు పెట్టినా కాఫర్ డ్యాం కట్టేవారు. నీళ్లు ఎత్తిపోయాలని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే.. బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తానని రేవంత్ అన్నాడు. చర్లపల్లి జైల్లో వేస్తానని బెదిరించాడు. శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి ఉద్యమ బిడ్డను అవమానించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే నానా యాగీ చేశారు.

మూడు చెక్ డ్యాంలను పేల్చివేసిన విధ్వంస ప్రభుత్వం ఇది. పెద్ద వాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలింది.. రూ.100 కోట్ల నష్టం. ఎస్‌ఎల్బీసీ టన్నెల్ నేటికీ మృతదేహాలు తీయలేని దుస్థితి. వట్టెం పంప్ హౌస్ మునిగింది.. చెక్ డ్యాములు పటాకుల్లా పేలుతున్నాయి. మీ అవినీతి రాజ్యానికి ఇంతకంటే సాక్ష్యం ఏంటి?. చెక్ డ్యాంలు పేలిపోతుంటే ఎన్డీఎస్‌ఏ, బీజేపీ ఎక్కడ ఉన్నాయి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఉన్నది లుచ్ఛా కాంగ్రెసే..

‘యూనివర్సిటీ భూములు గుంజుకునే కుట్రలు జరుగుతున్నాయి. హెచ్‌సీయూ భూములు లాక్కుంటే..కోర్టు మొట్టికాయలు వేసింది. 400 ఎకరాలు తాకట్టు పెట్టి.. రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఈడీ విచారణ చేయాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దొంగ దీక్షలు నటిస్తున్నట్లు బీజేపీ నాయకుల ఎందుకు స్పందించరు?. చిత్తశుద్ది ఉంటే సెంట్రల్ కమిటీ రిపోర్టు మీద విచారణ చేయించండి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదు.

రూ.20 వేల కోట్ల బకాయిలను బీఆర్‌ఎస్ రాగానే చెల్లించింది. రూ.12 వేల కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఫీజులు అడిగిన కాలేజీలపై విజిలెన్స్ దాడులు. జీవో 97తో పాలిటెక్నిల్ విద్యార్థుల పొట్టగొడుతున్నాడు. అట్టర్ ఫ్లాప్ స్కిల్ యూనివర్సిటీకి, పాలిటెక్నిక్‌కు ముడిపెడుతున్నడు. వైఎస్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని మేం కొనసాగించినం. కాంగ్రెస్ పెట్టిన పథకాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రే ఊడగొట్టిండు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ లేదు.. ఉన్నది లుచ్ఛా కాంగ్రెసే’ నని మండిపడ్డారు.

వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారు: హరీశ్‌రావు

పదేళ్ల పాటు కేసీఆర్ ఎంతో కష్టపడి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా కుప్పకూలుస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలు, వ్యవస్థల నిర్వీర్యం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ ఘోర వైఫల్యాలను ఎండగడుతూ ఈ ఛార్జ్ షీట్‌ను ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు.

‘ఆరు గ్యారంటీల పేరుతో బాండు పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. ఒక కొత్త రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో కష్టపడి అద్భుతంగా నిర్మించారు. ఏ రంగం చూసినా తెలంగాణను దేశానికే ఆదర్శంగా, తలమానికంగా కేసీఆర్ తయారు చేశారు.

కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అద్భుతమైన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయి. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం.. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా దొరకని దీన స్థితికి దిగజారింది. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అప్పజెబితే.. పూర్తిగా నాశనం చేసి కుప్పకూల్చారు. పురోగమనం వైపు వేగంగా ప్రయాణం చేయాల్సిన రాష్ట్రం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో తిరోగమనం వైపు పయనిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.