3 September, 2026 | 8:22 AM

షకీల్‌కు 41 ఏ నోటీసులివ్వండి

08-06-2024 | 01:29am

చట్ట ప్రకారం దర్యాప్తు ఉండాలి: హైకోర్టు

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్, వర్ణి పోలీస్‌స్టేషన్లలో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్‌పై నమోదైన కేసుల్లో పోలీసులు నిబంధనల మేరకు దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్నేష్‌కుమార్ వర్సెస్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇచ్చాక విచారణ చేయాలని స్పష్టంచేసింది. పౌరసరఫరాల శాఖ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబానికి చెందిన మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం మాయంపై ఇటీవల వర్ణి, కోటగిరి పోలీస్‌స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి.

నిజామాబాద్‌లోని షకీల్‌కు చెందిన మూడు మిల్లుల్లో పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సోదాలు చేశారు. షకీల్ కుటుంబానికి చెందిన మిల్లులకు 50,732 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సరఫరా చేశారు. అందులో 33 వేల మెట్రిక్ టన్నులకు పైగా దుర్వినియోగమైనట్లు అధికారుల సోదాల్లో తేలింది. రూ.70 కోట్ల విలువైన బియ్యం కనపడకుండా పోయిందని అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని షకీల్ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారించారు. షకీల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ మిల్లుల రోజువారీ కార్యకలాపాల్లో పిటిషనర్ పాత్ర లేదని తెలిపారు.

పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ వాదనను ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. బియ్యం కనిపించలేదన్న కేసు దర్యాప్తులో ఉందని, ఎవరినీ వేధింపులకు గురిచేయడం లేదని చెప్పారు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించారని ఆరోపించారు. దర్యాప్తు దశలో వాటిని వెల్లడించలేమని చెప్పారు. ఆ వివరాలు అందజేసేందుకు గడువు కావాలని కోరారు. వాదనల తర్వాత పిటిషనర్‌కు 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులకు నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.