23-02-2026 12:19:26 PM
కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. ముదిరిన వివాదం
అందరి సంగతి చూస్తాం: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
హైదరాబాద్: కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(Kamareddy Government Degree College) భూముల విషయంలో వివాదం కొనసాగుతుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య వివాదం ముదిరింది. కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(BJP MLA Katipally Venkataramana Reddy) మధ్య వివాదం జరుగుతోంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు బయలుదేరారు. డిగ్రీ కళాశాల అంశంపై కలెక్టర్ కు ఎమ్మెల్యే వినతిపత్రం ఇవ్వనున్నారు.
తాము కూడా కలెక్టరేట్ కు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(MLA Venkataramana Reddy) ఇంటిముందు భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. డిగ్రీ కాలేజీ భూముల్లో ఒక్క గజం ఆక్రమించినా రాజీనామా చేస్తా అన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి(Congress leader Shabbir Ali) సవాల్ చేసినట్లు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలియదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆర్టీఐ కింద కాలేజీ భూముల వివరాలు అడిగినట్లు చెప్పారు. పూర్తి వివరాలు వచ్చాక.. అందరి సంగతి చూస్తామని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.