23-02-2026 12:25:57 PM
రాజ్యాంగ విలువల పునరుద్ధరణ కోసం పోరాటాలకు సిద్ధం
తక్షణమే చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో(Kyathanpally Municipality) రాజ్యాంగ బద్ధంగా జరగాల్సిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలను అధికార బలంతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్(Kalavena Shankar) ధ్వజమెత్తారు. సోమ వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెజార్టీ సభ్యుల బలం చూసి వణికిపోతున్న పాలకపక్షం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వికృత క్రీడకు తెరలేపిందని ఆయన నిప్పులు చెరిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కె, 243 యు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణీత సమయానికి, పారదర్శకంగా జరగాలని స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
ఈ నెల 16న పోలీసు జోక్యం పేరుతో ఎన్నికలను అర్థాంతరంగా నిలిపివేయడం, అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం వెనుక ముమ్మాటికీ రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సభలో అనవసరమైన విరామాలు తీసుకుంటూ సభ్యులను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేయడం చట్టపరమైన ప్రశ్నలకు దారితీస్తుందని హెచ్చరించారు. అహ్మదాబాద్ మున్సిపల్ చట్టం(Ahmedabad Municipal Act)- 2006 నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అధికారులు బేఖాతరు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో జాప్యం చేయరాదని, మెజార్టీ పరీక్షను కేవలం సభలోనే నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ, ఇక్కడ పాలకుల కనుసన్నల్లో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట ఒత్తిళ్లు ఉన్నా, గొడవలు జరుగుతున్నా ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు.
ఇటీవల బాల్క సుమన్‌పై(Balka Suman) పెట్టిన కేసులు, పీటీ వారెంట్లు జారీ చేయడం వంటివి కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలేనని శంకర్ అభివర్ణించారు. అణచివేతతో ఉద్యమ గొంతుకలను నొక్కలేరని, ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. క్యాతనపల్లి ప్రజల ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అనుమానాలకు తావులేకుండా తక్షణమే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చైర్‌పర్సన్ ఎన్నికను వీడియో రికార్డింగ్ సమక్షంలో నిర్వహించాలనీ, మెజార్టీ బల నిరూపణను కేవలం సభలోనే (ఫ్లోర్ టెస్ట్) చేపట్టాలనీ, 16న జరిగిన పోలీసుల అతిజోక్యంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని, మెజార్టీ సభ్యులపై రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులు, ఒత్తిళ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వరకు, క్యాతనపల్లిలో పాలకుల అరాచకాలను ఎండగట్టే వరకు సిపిఐ విశ్రమించదని స్పష్టం చేశారు.