15 June, 2026 | 1:54 AM

ఆర్‌ఓబీల్లో రాకపోకలకు అంతరాయం

15-06-2026 12:35 AM

మహబూబాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రైల్వే ట్రాక్ దాటడానికి కాజీపేట, డోర్నకల్ రైల్వే సెక్షన్లో పలు చోట్ల నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జీలు కొద్ది పాటి వర్షానికే నీళ్ళు నిండి రాక పోకలకు ఆటంకంగా మారుతున్నాయి. వరంగల్, నెక్కొండ, ఇంటికన్నె, రంగాపురం, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిల్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు నీళ్లు నిలిచి వాహనాలతో పాటు ప్రజలు నడవడానికి ఇబ్బందిగా మారుతున్నాయి.

కొన్నిచోట్ల వర్షాకాలం ప్రారంభం నుండి ముగిసేంతవరకు అండర్ బ్రిడ్జిల్లో నీరు నిండి కాలువలను తలపిస్తున్నాయి. నిత్యం అందులో నీరు ఉండడం వల్ల వాహనాల రాకపోకలను కూడా వర్షాకాలం ముగిసేంతవరకు నిలిపివేస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన అండర్ బ్రిడ్జిలు వర్షాకాలంలో ప్రయాణానికి పనికి రాకుండా పోతున్నాయి. దీనితో వర్షాకాలంలో రైల్వే ట్రాక్ దాటడానికి సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిలను ఆశ్రయించాల్సి వస్తోంది.

దీనివల్ల దూర భారం పెరిగి రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పాటు ప్రయాణ సమయం పెరిగిపోతుంది. కొన్నిచోట్ల  నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిల్లో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నప్పటికీ నిలిచే వరద నీరు బయటకు తొలగించడానికి ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలంలో భూమికి లోతులో అండర్ రైల్వే బ్రిడ్జిలు ఉండడంతో మోటర్లు పెట్టినప్పటికీ నీళ్లు పూర్తిగా తొలగించలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల వర్షాకాలంలో కేసముద్రం ఇంటికన్నె మధ్య నిర్మించిన ఆర్ యు బి, కేసముద్రం తాళ్లపూసపల్లి మధ్య రంగాపురం వద్ద నిర్మించిన ఆర్ యు బి, మహబూబాబాద్ పట్టణంలో ఆర్యుబి వరద నీటి కారణంగా ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి.

ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆర్ యు బి వరద నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలో ఒక ఆర్‌ఓబి, ఒక ఆర్ యు బీ, ఒక ఎల్సీ గేటు ఉన్నాయి. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రధానంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్యుబీ మాత్రమే వినియోగానికి అనువుగా ఉంది. అయితే వర్షాకాలంలో ఆర్ యు బి వరద నీటితో నిండి ఇబ్బందులు కలిగిస్తుంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి ఆర్యుబిల్లో వరద నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.